పాక్ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోంది

పాక్ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోంది

పాకిస్తాన్‌లో భారత హైకమిషన్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో అతిధుల పట్ల పాక్ వ్యవహరించిన తీరుపై శివసేన స్పందించింది. పాకిస్తాన్‌ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోందని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే వ్యాఖ్యానించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సెరేనా హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పాకిస్తాన్‌లోని పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. అయితే అక్కడికి వచ్చిన అతిథులను హోటల్ బయటే భద్రతా సిబ్బంది అడ్డుకోవడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్థవ్ థాకరే తన పార్టీ పత్రిక ‘సమ్నా’ సంపాదకీయంలో స్పందించారు. బాలాకోట్‌ వైమానిక దాడులతో పాకిస్తాన్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం గుణపాఠం చెప్పినా ఇప్పటికీ పాక్‌ తీరు మారలేదని దుయ్యబట్టారు. పొరుగు దేశం తోకలను కత్తిరించే చర్యలు చేపట్టాలని కోరారు. మోడీ ప్రభుత్వం తిరుగలేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.  పాక్‌ ఒక దేశంగా కాకుండా ఉగ్రవాదులను తయారు చేసి ప్రపంచానికి అందించే ఓ కర్మాగారంగా మారింది. పాక్‌పై ఐఎస్‌ఐ, ఆర్మీ ఆధిపత్యాన్ని చెలయిస్తున్నాయని తెలిపారు. శాంతి ప్రక్రియ పట్ల ఇమ్రాన్‌ ఖాన్‌ చొరవ చూపడం మంచిదే అయినా శనివారం ఇఫ్తార్‌ విందులో జరిగిన ఘటన శాంతిని నెలకొల్పే దిశగా ఉపకరిస్తుందా అని థాకరే ప్రశ్నించారు.