నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

భారత్ నుంచి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ ను బ్రిటన్ లోని ఒక కోర్టు బుధవారం మూడోసారి తిరస్కరించింది. ఈ కేసుపై తదుపరి విచారన 28 రోజుల తర్వాత జరుగుతుంది. నీరవ్ మోడీని రాబోయే మే 30న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. నీరవ్ మోడీని మార్చి 19న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు లండన్ లో అరెస్ట్ చేశారు. దాదాపు 2 బిలియన్ డాలర్ల పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు.

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బుధవారం బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఎదుట బెయిల్ కోసం మూడోసారి అప్పీల్ చేశాడు. ఇంతకు ముందు రెండు సార్లు అతని పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రెండు బిలియన్ డాలర్ల మేరకు మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

అయితే నీరవ్ మోడీ కోర్టులో హాజరుపరుస్తారా లేదా నైరుతి లండన్ లోని వాండ్స్ వర్త్ జైలు నుంచి వీడియో లింక్ ద్వారా విచారణ జరుపుతారా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. మార్చి 19న అరెస్టయినప్పటి నుంచి అతను అదే జైల్లో ఉన్నాడు. ఏప్రిల్ 26న జరిగిన విచారణ సందర్భంగా నీరవ్ మోడీ వీడియో లింక్ ద్వారా జడ్జి ఆర్బుత్ నాట్ ఎదుట హాజరయ్యారు.