బ్రిటన్ లో సిక్కులు ఇక కృపాణాలతో తిరగవచ్చు

బ్రిటన్ లో సిక్కులు ఇక కృపాణాలతో తిరగవచ్చు

బ్రిటన్ లో చాకులతో దాడులు చేసే నేరాలు పెరుగుతుండటంతో పార్లమెంట్ ఆమోదించిన ఒక కొత్త చట్టానికి ఈ వారం మహారాణి ఎలిజబెత్ టూ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చట్టం (అఫెన్సివ్ వెపన్స్ బిల్లు)లో గత ఏడాది చివరన సవరణ చేయడం జరిగింది. దీని ప్రకారం కృపాణాలు లేదా మతవిశ్వాసాలకు సంబంధించిన తల్వార్లు ధరించడం, వాటిని సరఫరా చేసేందుకు బ్రిటన్ సిక్కు సముదాయానికి చెందిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉండబోవు.

కృపాణాల అంశంపై తాము సిక్కు సముదాయంతో లోతుగా చర్చించినట్టు బ్రిటిష్ హోమ్ శాఖ ప్రతినిధి తెలిపారు. ఫలితంగా మతవిశ్వాసాలతో ముడిపడిన పెద్ద కృపాణాలు ధరించడం, వాటిని వెంట ఉంచుకొనే పరంపర కొనసాగేలా చట్టంలో సవరణ చేసినట్టు చెప్పారు. కొత్త బిల్లు చట్టంగా మారేటపుడు కృపాణాలకు మినహాయింపు కొనసాగించాలని కోరుతూ బ్రిటిష్ సిక్కుల అఖిలపక్ష ఎంపీల బృందం బ్రిటిష్ హోమ్ శాఖలోని ఒక ప్రతినిధి బృందానికి దిశానిర్దేశం చేసింది.

'నేను ప్రభుత్వం చేసిన సవరణ చూసి సంతోషిస్తున్నాను. ఈ విధంగా కొత్త చట్టం పెద్ద కృపాణాల అమ్మకం, వాటిని వెంట ఉంచుకోవడం, వాటి ఉపయోగాన్ని చట్టపరమైన హక్కుగా కొనసాగించే యధాతథ స్థితిని కొనసాగించనుంది. పెద్ద కృపాణాల (50 సెంటీమీటర్ల కంటే పొడవైన)ను సిక్కులు గురుద్వారాల ఉత్సవాల్లో, వారసత్వంగా వస్తున్న సిక్కు గత్కా మార్షల్ ఆర్ట్ ప్రదర్శన సందర్భంగా ఉపయోగిస్తారని' బ్రిటిష్ సిక్కుల ఈ బృందానికి చీఫ్, లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ అన్నారు. ఈ కొత్త చట్టం ప్రమాదకర ఆయుధాలను స్వాధీనం చేసుకొనేందుకు దోహదపడుతుందని బ్రిటిష్ హోమ్ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు.