యూకేజీ పిల్లాడి ఎన్నికల సర్వే

యూకేజీ పిల్లాడి ఎన్నికల సర్వే

ఎన్నికలు ముగిశాయో లేదో.. అప్పుడే సర్వేల గోల మొదలైంది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మరోసారి ఖాయమని మెజారిటీ సర్వేలు అంటుండగా.. ఏపీలో విజేత ఎవరనే విషయమై సర్వేలు తలో మాట చెబుతున్నాయి. ఈ సర్వేల్లో శాస్త్రీయత ఎంతనే విషయం పక్కన పెడితే ఇదో పెద్ద ప్రక్రియ. వందలాది మంది సిబ్బంది ఓ ప్రశ్నావళి రూపొందించి ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు ఖరారైనప్పుడు, పోలింగ్‌‌కు వారం ముందు, పోలింగ్‌ ముగిశాక.. ఇలా దశల వారీగా సర్వే నిర్వహిస్తారు. ఒక్కరితో సాధ్యమయ్యే పనైతే కానే కాదు. 

కానీ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ యూకేజీ విద్యార్థి ఒక్కడే ఏకంగా ఎన్నికల సర్వే చేసేశాడు. షేక్‌ నహీద్‌ అనే ఈ బాలుడు సర్వే ఫలితాలను కూడా ప్రకటించేశాడు. తన అంచనా ప్రకారం టీడీపీదే మళ్లీ అధికారం అని అంటున్నాడు. టీడీపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే 5 నుంచి 15 సీట్లు ఎక్కువగానే వస్తాయని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. వైసీపీకి 63 నుంచి 72 సీట్లు వస్తాయని.. జనసేన 8 సీట్లు గెలుచుకుంటుందని తన సర్వే ద్వారా బయటపడిందని షేక్‌ నహీద్‌ చెప్పాడు. 

నగరంలోని డ్రెయిన్‌ వీధికి చెందిన నహీద్‌ కొత్తపేటలోని కూరపాటి హైస్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. ఇతని  తండ్రి షేక్‌ ఇమ్రాన్‌ది ఐరన్‌ వ్యాపారం. ఎన్నికల ముందు తండ్రితో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో నహీద్‌.. అక్కడి ప్రజలతో మాట్లాడాడట. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అభిప్రాయాలనడిగి బుక్‌లో నోట్‌ చేసుకున్నాడట. వీటి ఆధారంగానే.. టీడీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాడీ బాలుడు.