ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో కమెడియన్ కి భారీ విజయం

ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో కమెడియన్ కి భారీ విజయం

ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కమెడియన్ వొలోదిమిర్ జెలెన్ స్కీకి భారీ విజయం లభించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా 41 ఏళ్ల టీవీ స్టార్ జెలెన్ స్కీకి 73 శాతం ఓట్లు వస్తాయని, ప్రస్తుత అధ్యక్షుడు పెత్రో పొరొషెంకోకి కేవలం 25 శాతం ఓట్లు వస్తాయని చెప్పాయి. మొదటి ఎగ్జిట్ పోల్స్ రాగానే అధ్యక్షుడు పొరొషెంకో తన ఓటమిని అంగీకరించారు. జెలెన్ స్కీ విజయంతో దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వొలోదిమిర్ జెలెన్ స్కీకి ఫోన్ చేసి అభినందించారు. ఉక్రెయిన్, కెనడాల మధ్య సహకారం మరింత అభివృద్ధి చెందగలదని కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. యూరోపియన్ కౌన్సిల్ అధినేత, నాటో చీఫ్ కూడా జెలెన్ స్కీకి తమ అభినందనలు తెలిపారు.

'మీరెక్కడ ఉన్నా మీ నమ్మకాన్ని వమ్ము చేయనని ఉక్రెనియన్లందరికీ వాగ్దానం చేస్తున్నానని' ఫలితాలు వచ్చిన తర్వాత జెలెన్ స్కీ చెప్పారు. 'నేనింకా అధ్యక్షుడిని కానప్పటికీ,  మాజీ సోవియట్ యూనియన్ లోని అన్ని దేశాలకు ఏదైనా సాధ్యమేనని ఒక ఉక్రెనియన్ పౌరుడిగా చెప్పదలచుకున్నానని' అన్నారు. 'నేను రాజకీయ నాయకుడిని కాను. నేను ప్రస్తుత వ్యవస్థను బద్దలు కొట్టేందుకు వచ్చిన ఒక సాధారణ వ్యక్తిని' అని షోలో తన పాత్ర మాదిరిగానే జెలెన్ స్కీ శుక్రవారం చర్చలో తెలిపారు. 

ఎన్నికల్లో పాల్గొనేందుకు కమెడియన్ గా సుప్రసిద్ధుడైన జెలోన్ స్కీని దేశ పౌరులంతా సమర్థించారు. ప్రముఖ టీవీ సిట్ కామ్ లో ఉక్రెనియన్ అధ్యక్షుడి పాత్ర మాత్రమే పోషించిన జెలెన్ స్కీకి రాజకీయాల్లో అనుభవం అసలే లేదు. ఆ సీరియల్ లో జెలెన్ స్కీ ఒక సాధారణ, నైతిక విలువలను బలంగా నమ్మే స్కూల్ టీచర్ పాత్ర పోషించారు. ఒక అవినీతి సంఘటన కెమెరా కంటికి చిక్కి వైరల్ కావడంతో ఆగ్రహించిన ఆ స్కూల్ టీచర్ దానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం, అనంతర పరిణామాల్లో అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరుగుతుంది. అప్పుడు అతను ఉక్రెయిన్ లో వేళ్లూనుకొని పోయిన వ్యాపార, రాజకీయ పెద్ద తలకాయలతో తలపడి అవినీతికి తలవంచడు. 'సర్వెంట్ ఆఫ్ ద పీపుల్' అనే ఈ షో మూడో సీజన్ కూడా ముగిసింది. ఇందులో జెలెన్ స్కీ పాత్ర అధ్యక్షుడయ్యాక సంపదతో తులతూగే, అవినీతి రహిత ఉక్రెయిన్ ఏర్పడినట్టు కొన్ని సంఘటనలు ఉన్నాయి.