దేశమంతా ఆసక్తిగా చూస్తోంది: ఉమ్మారెడ్డి

దేశమంతా ఆసక్తిగా చూస్తోంది: ఉమ్మారెడ్డి

ఎన్నికల్లో కౌంటింగ్‌ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అందుకే తమ అధినేత జగన్‌ సూచనల మేరకు అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు శిక్షణనిచ్చామని చెప్పారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ దాదాపు 400 మందికి ట్రైనింగ్ ఇచ్చామన్నారు. పోలింగ్ జరిగిన రోజు అల్లర్లు జరిగినట్టే, కౌంటింగ్ రోజున కూడా జరిగే అవకాశాలుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.

'ఏజెంట్లు, రిజర్వ్ ఏజెంట్లు ఎంతమంది ఉండాలో వివరించాం. రౌండ్ల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పాం. రీ కౌంటింగ్ ఏ సందర్భంలో చేస్తారో చెప్పాం. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వివరాలు, చివరివరకు ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాం' అని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్‌ను నిలిపివేస్తే తక్షణమే చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘం పనిచేస్తుందన్న ఉమ్మారెడ్డి.. టీడీపీ నేతలు ఓటమి భయంతో అసహనానికి గురవుతున్నారని చెప్పారు. కౌంటింగ్ గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని వివరించారు.