హఫీజ్ సయీద్ కు పెద్ద షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి

హఫీజ్ సయీద్ కు పెద్ద షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి

జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ కు ఐక్యరాజ్య సమితి పెద్ద షాక్ ఇచ్చింది. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన హఫీజ్, నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని చేసిన అప్పీల్ ను ఐరాస తిరస్కరించినట్టు ప్రభుత్వ వర్గాలు పీటీఐ వార్తాసంస్థకు గురువారం తెలిపాయి. రెండు రోజుల క్రితమే ఉగ్రవాద సంస్థను, దాని అనుబంధ సంస్థ ఫలా-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చట్టం 1997 కింద అధికారికంగా నిషేధించింది. 

జమాత్-ఉద్-దవా అధినేత కార్యకలాపాలకు సంబంధించిన 'అత్యంత గోపనీయ సమాచారం' సహా భారత్ సవివరంగా అందజేసిన సాక్ష్యాధారాల ఆధారంగా ఐరాస ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వార్తాసంస్థ తెలిపింది. ముంబై పేలుళ్ల అనంతరం డిసెంబర్ 10, 2008లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సయీద్ ఉగ్రవాద సంస్థను నిషేధించింది. దీనిపై హఫీజ్ లాహోర్ లోని న్యాయసంస్థ మీర్జా అండ్ మీర్జా ద్వారా 2017లో అప్పీల్ చేశాడు.

'సయీద్ జాబితాలోని వ్యక్తిగా కొనసాగుతాడని' అభ్యర్థనల పరిశీలనకు ఐక్యరాజ్యసమితి నియమించిన స్వతంత్ర విచారణాధికారి డేనియల్ కిఫర్ ఫసియాటి సయీద్ న్యాయవాది హైదర్ రసూల్ మీర్జాకు స్పష్టం చేసినట్టు తెలిసింది. సేకరించిన సమాచారం ఆధారంగా ఐక్యరాజ్యసమితి హఫీజ్ పై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు విచారణాధికారి తెలిపారు. 'జాబితాలో కొనసాగించేందుకు సహేతుకమైన, నమ్మదగిన ఆధారాలతో తగినంత సమాచారం ఉందని' చెప్పారు. ఈ సిఫార్సులను ఐరాస ఆంక్షల కమిటీ కూడా ఆమోదించింది.

సయీద్ అభ్యర్థనను భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా వ్యతిరేకించాయి. అమెరికా, యుకె, ఫ్రాన్స్ లు హఫీజ్ ను లిస్ట్ చేశాయి. 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించిన పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను నిషేధించాలని కొత్త అభ్యర్థన వచ్చిన సమయంలోనే ఐరాస 1267 ఆంక్షల కమిటీకి చేరింది. పుల్వామా దాడికి తమదే బాధ్యత అని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే ప్రకటించుకొంది.