అచ్చం 1992 వరల్డ్ కప్ లాగే...! ఏం జరుగుతోంది..?
27 ఏళ్ల క్రితం జరిగిన వరల్డ్ కప్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరిచిందో.. ఇప్పుడు 2019 వరల్డ్ కప్‌లో కూడా అలాంటి ప్రదర్శనే ఇస్తోంది పాకిస్థాన్ జట్టు.. తొలి మ్యాచ్‌లో ఓటమి.. రెండో మ్యాచ్‌లో విజయం.. మూడో మ్యాచ్ వర్షార్పణం.. ఏడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విక్టరీ..! ఇలా క్రికెట్ వరల్డ్ కప్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది ఆ జట్టు. అయితే, ఇక్కడ విచిత్రమేంటంటే.. పాకిస్థాన్ ప్రపంచ ఛాంపియన్‌గా ఆవిర్భవించిన 1992లో కూడా అచ్చం ఇలాగే గెలుపు, ఓటములను చవిచూసింది. వరుసగా ఏడు మ్యాచ్‌ల ఫలితాలు పునరావృతం కావడం విశేషం కాగా... ఈ రెండు ప్రపంచకప్‌ల్లోనూ మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక, 1992లో ప్రపంచకప్‌లో మాదిరిగానే ఈసారీ కూడా పాకిస్థాన్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో పరాజయంపాలైంది. అప్పుడు తన ఏడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది పాక్. ఈ సారి న్యూజిలాండ్‌నే ఓడించి సెమీస్ అవకాశాలు మెరుగు పరుచుకుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. అప్పుడు పాకిస్థాన్ ఆడిన ఆరో మ్యాచ్‌లో ఆమిర్ సొహైల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అవార్డు దక్కిచుకోగా... ఈసారి హారిస్ సొహైల్ ఆ ఘనత దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అభిమానులు అప్పటిలానే ఈసారి తమ జట్టు.. ప్రపంచకప్ కొట్టుకురావడం ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)