విశాఖ రైల్వే జోన్..! కేంద్రం బ్రేకులు...!?

విశాఖ రైల్వే జోన్..! కేంద్రం బ్రేకులు...!?

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల. దీనిని సాధించుకోవడానికి దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం కోరింది. అప్పటి నుంచి రైల్వే సాధన ఉద్యమం వేడెక్కింది. గత ఐదేళ్ళ కాలంలో జోన్ కోసం సాగించిన పోరాటం, రాజకీయ ఒత్తిళ్ళు ఫలితంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019 ఫిబ్రవరి 27 విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రెండో ఓఎస్డీగా ధనుంజయులుని.. నియమించి... సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించాలని అదేశించింది. ఇందుకు అనుగుణంగానే జోన్ ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధంచేసి సెప్టెంబర్ మొదటి వారంలో రైల్వే బోర్డుకు ఓఎస్డీ సమర్పించారు. ఇక్కడి నుంచి జోన్ పనులకు బ్రేకులు పడ్డాయి. 

ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు, నూతన రైళ్లకు సంబంధించి బోర్డు నుంచి వస్తున్న సంకేతాలు పరిశీలిస్తే జోన్ ఏర్పాటుపై కేంద్ర వైఖరిని అనుమానించాల్సి వస్తోందంటున్నాయి ప్రజా సంఘాలు. విశాఖ రైల్వేజోన్ కార్యాచరణ... జీఎం నియామకం.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎప్పటి నుంచి మనుగడలోకి వస్తుంది.. భూముల సేకరణ వివరాలు వెల్లడించాలని విశాఖ వాసి రైల్వే బోర్డుకు ఆర్టీఐ కింద సమాచారం కోరారు. ఇందుకు రైల్వే బోర్డు నుంచి వచ్చిన సమాధానం పరిశీలిస్తే జోన్ ఏర్పాటు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డిపిఆర్ పరిశీలనలో ఉందని బోర్డు నుంచి సమాధానం వచ్చింది. వాస్తవానికి జోన్ ప్రకటన వెలువడినప్పుడే నెలల వ్యవధిలో విభజన ప్రక్రియ మొదలవుతుందని భావించారు. అయితే, జోన్ పై కేంద్రం చిన్న చూపు చూస్తుంద నే అభిప్రాయం బడ్జెట్ కేటాయింపులు బట్టి చూస్తే అర్ధమవుతోంది. రాయగఢ్ డివిజన్, విశాఖ జోన్ ఏర్పాటుకు 170కోట్ల రూపాయలు అంచనాలు రూపొందించగా.... మూడు కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.