ముందస్తు ప్రణాళికతోనే ఢిల్లీలో అల్లర్లు... ఎవ్వరినీ వదిలేది లేదు..!

ముందస్తు ప్రణాళికతోనే ఢిల్లీలో అల్లర్లు... ఎవ్వరినీ వదిలేది లేదు..!

ఢిల్లీ అల్లర్లతో సంబంధమున్న ఏ ఒక్కర్నీ వదలబోమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు... అల్లర్లకు దారి తీయడంపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగింది. అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. 3 రోజుల పాటు అల్లర్లు కొనసాగాయంటే... పోలీసులు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించాయి. ఢిల్లీ తగులబడిపోతుంటే... హోం మంత్రి అమిత్‌ షా ఎక్కడికి వెళ్లారని విపక్షాలు మండిపడ్డాయి. అయితే, చర్చలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానమిచ్చారు. ముందుగా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు నివాళులు అర్పించారాయన. సీఏఏ వల్ల పౌరుల హక్కులకు ఎలాంటి భంగం కలగబోదన్నారు. అయితే, ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ అల్లర్లు ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రగా కనిపిస్తోందన్నారు అమిత్‌ షా. అల్లర్లతో సంబంధం ఉన్న వారు ఏ మతం, ఏ కులం, ఏ రాజకీయ పార్టీకి  చెందిన వారైనా వదిలే ప్రసక్తే లేదని అమిత్‌ షా స్పష్టంచేశారు. అల్లర్లు జరుగుతున్న సమయంలో వాటిని నియంత్రించేందుకు తాను ఢిల్లీ పోలీసులతోనే నిరంతరం టచ్‌లో ఉన్నట్టు తెలిపారు అమిత్‌ షా. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వచ్చినా... ఆ కార్యక్రమాలకు తాను హాజరు కాలేదని అమిత్‌ షా.  కేవలం 36  గంటల్లో ఢిల్లీ పోలీసులు అల్లర్లను నియంత్రించారన్నారు అమిత్‌ షా. మొత్తం 700 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఈ అల్లర్లతో సంబంధం ఉన్న ఇరు వర్గాలకు చెందిన 2,647 మందిని అదుపులోకి  తీసుకున్నట్టు వెల్లడించారు. హింసాత్మక దాడుల కోసం నిధులు సమకూర్చిన ముగ్గుర్ని అరెస్టు చేశామని తెలిపారు షా. అయితే, అమిత్‌ షా ప్రసంగిస్తుండగా, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రభుత్వం ఏమి చెబుతుందో వినాలని స్పీకర్  ఓం బిర్లా విజ్ఞప్తి చేసినా... విపక్ష సభ్యులు పట్టించుకోలేదు.