'గొప్ప నాయకుడిని కోల్పోయాం..'

'గొప్ప నాయకుడిని కోల్పోయాం..'

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ ఆకస్మిక మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంత్‌ కుమార్ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన భార్య డాక్టర్ తేజస్వినితో మోడీ మాట్లాడి ఓదార్చారు. అనంతకుమార్ మంచి పార్లమెంటేరియన్ అని ప్రజల సంక్షేమానికి పాటుపడిన ఆయన మృతి తీరని లోటని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బీజేపీతోపాటు ప్రజలకు సేవలందించిన అనంతకుమార్ మృతి తీరని లోటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. 

1959 జూలై 22న జన్మించిన అనంత్‌కుమార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఏబీవీపీలో కీలక పాత్ర పోషించారు. 1996లో తొలిసారి దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడి నుంచే 6 సార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. వాజ్‌పేయ్ ప్రధాన మంత్రిగా పనిచేసినప్పుడు.. ఆయన మంత్రివర్గంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014లో రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కెమికల్స్, ఫెర్టిలైజర్స్‌ను నిర్వర్తించారు. జులై 2016 నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.