వంద రోజుల పాలన అద్భుతం..!

వంద రోజుల పాలన అద్భుతం..!

ప్రధాని నరేంద్ర మోడీ వంద రోజుల పాలన చూసి దేశమొత్తం అబ్బురపడిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వంద రోజుల్లోనే సంచలన స్థాయిలో బిల్లులు ఆమోదించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరిస్థితి అంతకంతకు దిగజారుతుంటే.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎలాంటి ఒడిదుడులకు లోనవ్వడంలేదని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం, పాక్ భూభాగంలోకి వెళ్లి జరిపిన సర్జికల్ దాడులు.. ప్రపంచవ్యాప్తంగా మోడీ సత్తాను చాటాయని కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది లేకుండా దేశాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారు. గతేడాది కంటే 9 శాతం ఎగుమతులు పెరిగాయని.. 331 బిలియన్‌ డాలర్లకు ఎగుమతులు చేరుకున్నాయన్నారు. జాతీయ రహదారులు 1.32 లక్షల కి.మీ.కు చేరుకున్నాయని కిషన్‌రెడ్డి.. రోజుకు సరాసరి 30 కి.మీ. రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒకే దేశం - ఒకే పవర్‌ గ్రిడ్‌ నినాదంతో ముందుకెళ్లామన్నారు. సంస్కరణలతో వేగం పెరిగిందని... సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిర్ణయం తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.