రైతులతో కేంద్రం చర్చలు.. ముందుగా బీజేపీ నేతల కీలక భేటీలు

రైతులతో కేంద్రం చర్చలు.. ముందుగా బీజేపీ నేతల కీలక భేటీలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశరాజధాని శివారులో రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది... ఓవైపు చలి, మరోవైపు వర్షం ఇలా ఇబ్బంది పెట్టినా.. వాళ్లు వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.. అయితే, ఇవాళ రైతు సంఘాల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర మంత్రుల బృందం.. రైతు ప్రతినిధులతో భేటీ కానుంది. అయితే ఈ చర్చలకు ముందు... బీజేపీ నేతల కీలకంగా సమావేశమయ్యారు.. ఓవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమావేశం అయ్యారు.. రైతులతో జరిగే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్‌ను కలిశారు పంజాబ్ బిజేపి నేతలు... రైతుల డిమాండ్లు, ఆందోళనపైనే చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఇవాళ జరిగే చర్చలు సఫలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు నరేంద్ర సింగ్‌ తోమర్‌.. నేటి చర్చల్లో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.. అయితే, వ్యవసాయ చట్టాల రద్దు మినహా.. రైతులు ఏ ప్రతిపాదన తెచ్చినా దాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి.. మరి కేంద్రం, రైతు సంఘాల మధ్య జరగనున్న ఎనిమిదో విడత చర్చల్లోనైనా పురోగతి లభిస్తుందా? మరోసారి ప్రతిష్టంభన నెలకొంటుందా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.