సోనియాను కలిసిన కేంద్రమంత్రి

సోనియాను కలిసిన కేంద్రమంత్రి

పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీని కలిశారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం సోనియా నివాసానికి వెళ్లిన జోషీ.. ఆమెతో 15 నిమిషాలు భేటీ అయ్యారు. లోక్‌సభ సమావేశాల గురించి చర్చించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా ఉన్నారు. సోనియా గాంధీతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌ నబీ ఆజాద్‌, లోక్‌సభలో డీఎంకే పక్ష నేత టీఆర్‌ బాలులతో కూడా ప్రహ్లాద్‌ జోషీ సమావేశమయ్యారు.

జూన్‌ 17వ తేదీన పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 19వ తేదీన స్పీకర్‌ ఎన్నిక జరపాలని నిర్ణయించారు. 20వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూలై 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.