కేంద్ర మంత్రి కుమారుడు అరెస్ట్

కేంద్ర మంత్రి కుమారుడు అరెస్ట్

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కుమారుడు, తమ్ముడి కొడుకుపై మధ్యప్రదేశ్ లోని నరసింహపూర్ గోటేగావ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కొందరిపై వాళ్లిద్దరూ ప్రాణాలు తీసేందుకు దాడి చేశారని ఆరోపణ. ఈ దాడిలో గాయపడిన నలుగురిలో 50 ఏళ్ల హోంగార్డ్ ఈశ్వర్ రాయ్ కి తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. 

స్థానికుల కథనం ప్రకారం ఇద్దరు యువకులు హిమాన్షు రాథోడ్, రాహుల్ రాజ్ పుత్ ఒక పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గోటేగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాయ్ బజార్ ప్రాంతంలో అర్థరాత్రి ప్రహ్లాద్ పటేల్ కుమారుడు ప్రబల్ పటేల్ తో వారికి గొడవ జరిగింది. మొదట వాళ్లిద్దరినీ ప్రబల్, అతని సహచరులు చితకబాదారు. ఆ తర్వాత వాళ్లని హోంగార్డ్ ఈశ్వర్ రాయ్ ఇంటికి తీసుకెళ్లారు. ఈశ్వర్ రాయ్ కుమారుడు గతంలో ప్రబల్ పటేల్, మోనూ పటేల్ లకు సన్నిహితుడు. ఇప్పుడు వారితో వేరుపడ్డాడు. రాయ్ కుమారుడు శివమ్ రాయ్ ని పిలిచి అతనిపై కర్రలు, బేస్ బాల్ బ్యాట్లతో దాడి చేశారు. కొడుకుపై దాడి చేయడం చూసి ఈశ్వర్ రాయ్ బయటి రాగానే అతనిపై కూడా దాడి జరిగింది.

పోలీసులు ప్రబల్ పటేల్, అతని ఆరుగురు సహచరులను అరెస్ట్ చేశారు. మిగతా వారిని అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. వీరిపై ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం), 147, 48, 149(గొడవ సృష్టించడం), 365 (అపహరణ), 294 (అసభ్య ప్రవర్తన), 427 కింద కేసు నమోదైంది.