6 నెలల్లో రూ. 13,315 కోట్లు తాగేశారు

6 నెలల్లో  రూ. 13,315 కోట్లు తాగేశారు

ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నా.. ఎన్ని రాష్ట్రాలు మద్యంపై నిషేధం విధించినా మద్యం అమ్మకాలకు ఎలాంటి ఢోకా లేదు. ప్రముఖ మద్యం తయారీ కంపెనీ యునైటెడ్‌ స్పిరిట్స్‌  అమ్మకాలను చూస్తే దేశంలో ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్‌ బాగా పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం డియాజియో చేతిలో ఉన్న ఈ కంపెనీ... ఈ ఏడాది జూన్‌ వరకు అంటే ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలతో రూ. 13,315 కోట్ల ఆదాయం ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో ఈ కంపెనీ రూ. 6,900 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. ఎండాకాలం పూర్తయినందుకేమో జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో రూ. 6,415 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. విచిత్రమేమిటంటే సాధారణ బ్రాండ్‌లకంటే   ప్రీమియం బ్రాండ్‌ల అమ్మకాలు బాగా పెరుగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఖరీదైనవాటికి...
కంపెనీ బ్రాండ్లలో 'ప్రీమియం అండ్‌ అబౌ' కేటగిరికి చెందిన బ్రాండ్ల అమ్మకాలు 20 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఈ పోర్టుఫోలియోలో  విస్కీదే పైచేయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో 65 శాతం టర్నోవర్‌ ఈ బ్రాండ్ల నుంచే వస్తోంది. జానీ వాకర్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌, బ్లాక్‌ డాగ్‌ బ్రాండ్ల అమ్మకాలకు విశేష ఆదరణ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. తన బ్రాండ్లలో కొన్నింటిని రీ బ్రాండ్‌ కూడా చేసింది కంపెని. సిగ్నేచర్, రాయల్‌ ఛాలెంజ్‌ విస్కీలను రీ బ్రాండ్‌ చేసింది. అయితే పాపులర్‌ బిజినెస్‌ విభాగానికి చెందిన బ్రాండ్ల అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. బాగ్‌పైపర్‌ విస్కీ అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు కంపెనీ తెలిపింది.

పన్నుల బాదుడు...
మద్యం అమ్మకాలతో కంపెనీ రూ.13,000 కోట్ల టర్నోవర్‌ సాధించగా.. దీనికి అవసరమైన  ముడి సరుకు కొనుగోలు విలువ ఎంతో తెలుసా? కేవలం రూ.2,000 కోట్లు.  అంటే కొనుగోలుకు, అమ్మకానికి మధ్య తేడా రూ. 11,000 కోట్లు. ఇందులో కంపెనీ ఎక్సైజ్‌ సుంకం రూపంలోనే రూ. 9,100 కోట్లు చెల్లిస్తోంది. ప్రకటనలు, ఇతరత్రా ఖర్చులకు రూ. 590  కోట్లు ఖర్చు పెట్టంది. అన్ని రకాల ఖర్చులు, పన్నులు పోగా.. కంపెనీకి మిగిలిన నికర లాభం రూ. 290 కోట్లే.


మొత్తానికి ఈ వ్యాపారం వల్ల అత్యధికంగా లబ్ది పొందుతున్నది ప్రభుత్వమే.