రేపటితో ముగుస్తున్న అన్‌ లాక్‌ 1.0... మళ్ళీ లాక్‌ డౌన్‌ కు రాష్ట్రాల మొగ్గు

రేపటితో ముగుస్తున్న అన్‌ లాక్‌ 1.0... మళ్ళీ లాక్‌ డౌన్‌ కు రాష్ట్రాల మొగ్గు

రేపటితో అన్‌లాక్‌ 1.0 పూర్తవుతోంది. జూలై 1 నుంచి అన్‌లాక్‌ 2.0 మొదలు కావాలి. కాని దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటంతో  చాలా రాష్ట్రాలు లాక్ ‌డౌన్‌ వైపే మొగ్గుచూప్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి... మరికొన్ని రాష్ట్రాలు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలను జూలై 31 వరకు పొడిగించారు. అయితే ఇవి ఆ రాష్ట్రంలోని కట్టడి ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే జూలై 1 నుంచి రాత్రిపూట కర్ఫ్యూను 10 గంటల నుంచి 5 గంటల వరకు కుదించారు. ఝార్ఖండ్‌లోనూ లాక్‌డౌన్‌ ఆంక్షలను జూలై 31 వరకు పొడిగించారు. అంతర్రాష్ట్ర, స్థానిక ప్రయాణాలపైనా నిషేధం విధించారు. 
 
అసోంలోని కామరూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాలో ఇప్పటికే 14 రోజుల కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జూన్‌ 28 నుంచి జూలై 12 వరకు  ఆ జిల్లాలో ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మందులషాపులు తప్ప మరేవీ తెరవరు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి  ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 10 నుంచి ప్రభుత్వ కార్యాలయాలేవీ శనివారం పనిచేయవు.  మణిపూర్‌లో జూలై 15 దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌ సింగ్‌ ప్రకటించారు.  
 

ఇటు తమిళనాడులో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో గ్రేటర్‌ చెన్నై పరిధిలో ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, మధురై, తేని జిల్లాలో కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఐతే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని భావిస్తోన్న తమిళనాడు ప్రభుత్వం...ఇవాళ పళనిస్వామి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. తమిళనాడు వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ పై ఆ తర్వాత క్లారిటీ రానుంది.రాజస్థాన్‌ సర్కార్ ఓవైపు లాక్‌డౌన్‌కు సిద్ధమవుతూనే... కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో భౌతికదూరం పాటిస్తూ ఆలయాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కొద్ది మందికి మాత్రమే వెళ్లేందుకు అనుమతిచ్చింది. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు 14 రోజుల  క్వారంటైన్‌ ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇక హైదరాబాద్‌లో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్‌ మళ్లీ లాక్‌డౌన్‌  విధించనున్నారు అని సంకేతాలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.