నేటి నుంచి అమల్లోకి అన్‌లాక్‌ 5.0.. ఏమేం మారనున్నాయంటే ?

నేటి నుంచి అమల్లోకి అన్‌లాక్‌ 5.0.. ఏమేం మారనున్నాయంటే ?

దేశ వ్యాప్తంగా దశలవారీగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ తాజా అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ దశలో మరిన్ని మినహాయింపులిచ్చిన కేంద్రం కంటైన్‌మెంట్‌ జోన్ల బయట ఈ నెల 15 నుంచి షరతులకు లోబడి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్న కేంద్రప్రభుత్వం అన్‌లాక్‌ ప్రక్రియలో ఐదో దశ మార్గదర్శకాలను రిలీజ్‌ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నింబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఆర్నెళ్లుగా మూతబడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతిస్తూ కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని అన్‌లాక్‌ 5.0 నిబంధనల్లో పేర్కొన్న కేంద్రం.. ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే విడిచిపెట్టింది. క్రీడాకారుల శిక్షణకోసం స్విమ్మింగ్‌ పూల్స్‌ తెరిచే వెసులుబాటు కల్పించింది. అయితే, పార్కులు, సంబంధిత స్థలాలు మూసి ఉంచాలని స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

తాజా మార్గదర్శకాల్లో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని కేంద్రం ప్రత్యేకంగా పేర్కొంది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లు దశల వారీగా తెరిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఇష్టానికే వదిలేసింది కేంద్రం. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించుకోవచ్చన్న కేంద్రం.. పిల్లల్ని పంపే అంశంపై తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరని చెప్పింది. రాష్ట్రాలు సొంత మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని ఉన్నత విద్యా విభాగాల నిర్ణయానికే విడిచిపెట్టింది.

ఆన్ ‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల 100 మందితో రాజకీయ, సాంస్కృతిక, మతపర సమావేశాలను నిర్వహించుకోవడానికి.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, ఈ సమావేశాలకు వందమందికి పైగా అనుమతిచ్చే అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కేంద్రం. అన్‌లాక్‌ 5.0 నిబంధనల్లోనూ అంతర్జాతీయ విమానయానానికి అనుమతి ఇవ్వలేదు కేంద్ర హోంశాఖ. కేంద్రం అనుమతి లేకుండా.. రాష్ట్రాల్లో ఎలాంటి స్థానిక లాక్‌డౌన్లు విధించకూడదని తన మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రాల పరిధిలో గానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై గానీ ఎలాంటి ఆంక్షలు విధించొద్దని, ప్రయాణానికి ప్రత్యేకంగా ఎలాంటి పాసులూ అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది.