మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి

మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి

దిశ ఘటన మరువక ముందే మరో విషాదం జరిగింది.. రెండు రోజులుగా పార్లమెంట్‌ను కుదిపేసిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు చనిపోయింది. ఢిల్లీలోని సఫ్థార్‌గంజ్ ఆస్పత్రిలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. నిన్న రాత్రి 11.10 గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందన్నారు డాక్టర్లు. లైఫ్ సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందించినా... ఆమె శరీరం సహకరించలేదని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన 23 ఏళ్ల యువతిపై గత డిసెంబర్‌లో అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్‌ 30న ఇద్దరు నిందితులు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితులు... చంపేందుకు కుట్ర చేశారు. కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లిన ఆమెను దారిలోనే అడ్డుకున్నారు. అంతా చూస్తుండగానే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించారు. 

బాధితురాలు కేకలు వేస్తూ కిలోమీటరు మేర పరుగులు తీసింది. అయినా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. బాధితురాలే కాలిన గాయాలతో స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. లక్నో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఉన్నావ్ బాధితురాలు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. తనపై దాడి చేసిన వాళ్ల వివరాలను తెలిపింది. తనపై అత్యాచారం చేసిన ఇద్దరు సహా మొత్తం ఐదుగురు తనపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారని తెలిపింది. మరోవైపు నిందితులకు ఉరిశిక్షపడాలన్నది తన చివరి కోరికంటూ నిన్న ఉదయం తన తల్లిదండ్రులకు చెప్పింది బాధితురాలు. మృగాలకు ఉరిశిక్షపడకుండా తాను చనిపోనంది. కానీ... చివరి కోరిక నెరవేరకుండానే ప్రాణాలు కోల్పోయింది ఉన్నావ్ బాధితురాలు.