భార్య కోసం తాజ్ మహల్.. పూర్తి కాకుండానే..

భార్య కోసం తాజ్ మహల్.. పూర్తి కాకుండానే..

ప్రేమ కట్టడమైన ఆనాటి తాజ్ మహల్ కు పోటీగానా అన్నట్టు.. యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో మరో తాజ్ మహల్ వెలసింది. చనిపోయిన తన భార్య (తాజా ముల్లి బీబీ) కు గుర్తుగా ఫైజుల్ హసన్ ఖాద్రీ (83) అనే రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ తన సొంత స్థలంలో తాజ్ మహల్ నిర్మాణం ప్రారంభించాడు. అది పూర్తి కాకుండానే ఖాద్రీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నిన్న రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిపోవడంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సాయంత్రమే చనిపోయాడు. దీంతో ఈ తాజ్ మహల్ మరోసారి వార్తల్లోకెక్కింది. 

తాజ్ మహల్ కోసం ఆయన ఎవరిదగ్గరా చేయి చాచలేదు. తాను జమ చేసుకున్న రూ. 2 లక్షల్ని వినియోగించాడు. డబ్బు సరిపోకపోవడంతో మధ్యలోనే పని ఆగిపోయింది. ఈ వార్త అప్పటి సీఎం అఖిలేశ్ కు తెలియడంతో ఆయన లక్నోకు పిలిపించుకొని.. మిగతా డబ్బు ఇస్తానని, కట్టడాన్ని పూర్తి చేయాలని సూచించాడు. అయితే ఖాద్రీ మాత్రం సున్నితంగా తిరస్కరించి.. తమ ఊళ్లో బాలికల కోసం ప్రత్యేకమైన జూనియర్ కాలేజీ నిర్మించాల్సిందిగా అఖిలేశ్ కు సూచించాడు. ఫలితంగా ఆ ఊళ్లో గాల్స్ కాలేజీ తయారైంది. ఆ కాలేజీకి కూడా ఖాద్రీ కొంత స్థలాన్నివ్వడం విశేషం. 

ఖాద్రీ పరోపకారానికి, భార్య మీద తాను చూపించిన ప్రేమ చిహ్నాన్ని ఊరి ప్రజలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. నూతన తాజ్ మహల్ పక్కనే ఖాద్రీని కూడా సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆనాడు ముంతాజ్ సమాధి పక్కనే.. మరణించాక షాజహాన్ సమాధి కూడా నిర్మించినట్టు. ఈ విధంగా ఖాద్రీ కిరీటం లేని షాజహాన్ గా నిరూపించుకున్నాడని పలువురు అంటున్నారు.