ఆలయంలోనే అత్యాచారం, సజీవ దహనం

ఆలయంలోనే అత్యాచారం, సజీవ దహనం

ఉత్తరప్రదేశ్ లో నేరాలు-ఘోరాల పరంపర కొనసాగుతోంది. హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. బాధితులు జరిగిన ఘటనలను పోలీసు అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సంభాల్ జిల్లాలో ఓ మహిళపై దేవాలయంలోనే అత్యాచారం చేసి తర్వాత తగులబెట్టారు. రాజ్ పురా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. రాత్రి 2.30 గంటలకు ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు మహిళను సమీపంలోని యజ్ఞశాల దేవాలయంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను తగులబెట్టారు. జోరుగా వర్షం కురుస్తున్న ఆ సయమంలో ఆ కిరాతకులు ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న భర్త 100 నంబర్ కు ఫోన్ చేసినా... ఫలితం లేకుండా పోయింది. ఆ కుటుంబం ఘజియాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరమ్ సింగ్, మహావీర్, చరణ్ సింగ్, గుల్లా, కుమర్పాల్ లు నిందితులుగా గుర్తించారు పోలీసులు. వారిపై 376డి,302, 201, 147,148,149 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు గత కొన్ని మాసాలుగా ఆ మహిళను వేధిస్తున్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం రెండు టీంలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.