'ఉప్పెన'తో అలా.... '30 రోజుల్లో...' తో ఇలా..

'ఉప్పెన'తో అలా.... '30 రోజుల్లో...' తో ఇలా..

కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ సినిమాలు జనాల ముందుకు వచ్చేశాయి. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. వాటిలో 'ఉప్పెన', '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' సినిమాల గురించి చెప్పుకుని తీరాలి. ఎందుకంటే ఈ రెండు సినిమాలు పాటలతో ఆడియన్స్ లో ఎంతో హైప్ ని సృష్టించాయి. ఇక రెండు సినిమాల హీరోలకు అవి డెబ్యూ సినిమాలే. ఇక '30 రోజల్లో ప్రేమించటం ఎలా'లో యాంకర్ ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇస్తే... మెగా కుటుంబానికి చెందిన వైష్ణవ్ తేజ్ కి 'ఉప్పెన' మొదటి సినిమా. రెండు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన కృతిశెట్టి, అమృతా అయ్యర్ లకు తొలి సినిమాలే.

రెండు సినిమాలూ మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యాయి. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'లో 'నీలి నీలి ఆకాశం' పాట విడుదలై సినిమాను ఎంతో హైట్స్ కి తీసుకువెళ్ళింది. ఇక 'ఉప్పెన'లో 'నీ కన్ను నీలి సముద్రం', 'ధక్ ధక్ ధక్' పాటలు సైతం సినిమాపై అంచనాలను ఆకాశమంత ఎత్తుకు పెంచాయి. రెండు సినిమాలూ గతేడాది విడుదల కావలసి ఉన్నా... కరోనా కారణంగా వాయిదా పడి ఈ ఏడాది జనం ముందుకు వచ్చాయి. 

వారు ఉల్లాసంగా... వీరు నీరసంగా...

ఈ రెండు సినిమాలకు చాలా పోలికలు ఉన్నాయి. అయితే రిజల్ట్ లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. 'ఉప్పెన' ఉప్పెనలా దూసుకుపోయి వసూళ్ళ సునామీ సృష్టిస్తే... '30 రోజుల్లో...' పబ్లిసిటీ జిమ్మిక్ తో ఎదో ఒడ్డున పడ్డట్టయింది. ఇక 'ఉప్పెన' హీరో వైష్ణవ్ తేజ్ కి రిలీజ్ కి ముందే మరో సినిమా ఆఫర్ రావటమే కాకుండా రిలీజ్ తర్వాత ఉప్పెనలా అవకాశాలు వెల్లువెత్తున్నాయి. తను సై అంటే సినిమాలు తీయటానికి నిర్మాతలు క్యూ కట్టడం ఖాయం. ఇక హీరోయిన్ కృతి శెట్టి సంగతి చెప్పనక్కరలేదు. వరుస సినిమాలు కమిట్ అవుతూ కోటి పాట పాడుతోంది. దర్శకుడు బుచ్చిబాబుది అదే పరిస్థితి.

కట్ చేస్తే '30 రోజల్లో ప్రేమించటం ఎలా' హీరో ప్రదీప్ తదుపరి సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. యాంకరింగ్ తో మాత్రం బిజీగా ఉన్నాడు. హీరోయిన్ అమృతా అయ్యర్ జాడే లేదు. ఆ తర్వాత వచ్చిన 'రెడ్' సైతం ఆశలు నింపలేక పోయింది. దీంతో అమ్మడి కిట్టీలో ఓ తమిళ, ఓ తెలుగు చిత్రాల్లో మాత్రమే ఉంది. దర్శకుడు మున్నా కూడా చప్పుడు చేయటం లేదు. ఇక నిర్మాతల విషయానికి వస్తే 'ఉప్పెన' నిర్మాతలు తమ సినిమా ఘన విజయంతో అనుకున్న పారితోషికాలకంటే పెద్ద మొత్తంలో హీరో, హీరోయిన్, దర్శకులకు గిఫ్ట్ లు ఇచ్చేస్తున్నారు. '30 రోజుల్లో...' నిర్మాత యస్.వి. బాబు చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు జస్ట్ పాస్ అయిపోయాడు. 'ఉప్పెన'టీమ్ ఉల్లాసంగా దూసుకుపోతుంటే... '30 రోజుల్లో...' టీమ్ నీరసంగా, నిదానంగా అడుగులేస్తోంది. ఒకే టైమ్ లో క్రేజ్ తెచ్చుకున్న రెండు సినిమాలు రిలీజ్ తర్వాత పరిస్థితి ఇది.