కాంగ్రెస్ లో చేరిన 'రంగీలా' ఊర్మిళ 

కాంగ్రెస్ లో చేరిన 'రంగీలా' ఊర్మిళ 

ప్రతిసారి లాగానే ఈ సారి కూడా ఎన్నికల సీజన్ లో నేతలు, నటులు రాజకీయ పార్టీల్లో చేరడం జోరుగా సాగుతోంది. ఈ ఒరవడిని కొనసాగిస్తూ బాలీవుడ్ లో 'ఛమ్మా ఛమ్మా', 'రంగీలా గర్ల్' గా పేరొందిన సినీ నటి ఊర్మిళా మాతోండ్కర్ ఇక రాజకీయాల్లోకి రంగం ప్రవేశం చేసింది. లోక్ సభ ఎన్నికల బరిలోకి కాలు మోపడానికి ముందు ఊర్మిళ బుధవారం (27 మార్చి) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. ఊర్మిళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ చేరుకుంది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి అధికారికంగా పార్టీ సభ్యత్వం స్వీకరించింది. ఆమె ఉత్తర ముంబై నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 

ఊర్మిళతో పాటు కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్, ఎమ్మెల్యే అస్లమ్ షేక్, జీఎస్ భూషణ్ పాటిల్ తదితరులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఊర్మిళను చేర్చుకొని ఆమెకు ఉత్తర ముంబై లోక్ సభ స్థానానికి టికెట్ ఇచ్చేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

అయితే ఈ సీటు నుంచి కాంగ్రెస్ లో ముందు నుంచి కొనసాగుతున్న బిగ్ బాస్ ఫేమ్ శిల్పా షిండే, అసావరీ జోషీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు తెలిసింది. బీజేపీ కంచుకోట అయిన ఈ సీటులో సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టినీ మరోసారి అభ్యర్థిగా నిలిపింది.