భారత్ పై మరో దాడి జరిగితే పెను సమస్యలు తప్పవు:పాక్ కు అమెరికా వార్నింగ్

భారత్ పై మరో దాడి జరిగితే పెను సమస్యలు తప్పవు:పాక్ కు అమెరికా వార్నింగ్

అగ్రరాజ్యం అమెరికా దాయాది దేశం పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ పై మరో దాడి జరిగితే పెను సమస్యలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న నాయకులపై కఠిన చర్యలు తక్షణమే చేపట్టకపోయినా భారత్ పై మరో ఉగ్రవాద దాడి జరిగినా ఇస్లామాబాద్ ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది.

అమెరికాలోని ఒక సీనియర్ పరిపాలన అధికారి బుధవారం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ 'జైషే మొహమ్మద్, లష్కరే తయ్యబా వంటి ఉగ్రవాద సంస్థలను నియంత్రించేందుకు పాకిస్థాన్ నిర్ణయాత్మకమైన కఠిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయక తప్పదని' అన్నారు.

తన పేరు బయటకు రాదనే షరతుపై ఆ అధికారి 'ఒకవేళ పాకిస్థాన్ వైపు నుంచి ఈ ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు, ప్రయత్నాలు చేపట్టకపోతే వేరే ఏదైనా మరో దాడి పాకిస్థాన్ కు పెద్ద కష్టాలు తెచ్చి పెట్టవచ్చు. ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరగడానికి అది కారణంగా మారుతుందని' తెలిపారు.

బాలాకోట్ లో భారతీయ వాయుసేన వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ చేపట్టిన చర్యల గురించి ప్రశ్నించినపుడు ఆయన ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఎలాంటి నిర్ణాయక చర్యలు చేపడుతోందనని అమెరికా, అంతర్జాతీయ సమాజం ఎదురు చూస్తున్నాయని చెప్పారు. 'పాకిస్థాన్ చేపట్టిన చర్యల ఆధారంగా ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని' ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవలే కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ కొన్ని ఆరంభ చర్యలు చేపట్టిందని ఆ అధికారి అన్నారు. ప్రభుత్వం కొన్ని ఉగ్రవాద సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని, కొందరి అరెస్ట్ చేయడం జరిగింది. జైషేకి చెందిన కొన్ని శిబిరాలను పరిపాలనా యంత్రాంగం తన నియంత్రణలోకి తీసుకుంది. ఇవే కాకుండా పాకిస్థాన్ ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధికారి చెప్పారు.