ఇరాన్ చమురు దిగుమతులు నిలిచిపోతే భారత్ పరిస్థితేంటి?

ఇరాన్ చమురు దిగుమతులు నిలిచిపోతే భారత్ పరిస్థితేంటి?

మే 2 తర్వాత భారత్, మరో 7 దేశాలకు ఇరాన్ చమురు దిగుమతుల నుంచి ఇచ్చిన మినహాయింపుని పొడిగించరాదని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మంగళవారం క్రూడాయిల్ ధరలు ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. మరికొద్ది రోజుల్లోనే క్రూడ్ ధరలు 80-85 డాలర్లకు చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇరానియన్ క్రూడ్ ప్రధాన దిగుమతిదారైన భారత్ కు అమెరికా ఆంక్షలు కచ్చితంగా మింగుడు పడనివే. మొత్తం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మార్కెట్లపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నిర్ణయం గురించి వార్తలు రాగానే సోమవారం దేశీయ ఈక్విటీ సూచీలు దారుణంగా పతనమయ్యాయి. క్రూడ్ లో ర్యాలీ కొనసాగితే దేశీయ రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ) నెమ్మదిస్తాయి. 

భారత్ తన ఆయిల్ డిమాండ్ లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల డాలర్ డిమాండ్ ను పెంచుతుంది. దీంతో రూపాయి-డాలర్ మారక రేటును తీవ్రంగా దెబ్బ తీస్తుంది. రూపాయి పతనంతో విదేశీ మదుపరులకు చెల్లించే డాలర్లు తగ్గుతాయి. ఫలితంగా భారత్ పెట్టుబడులు అనాకర్షణీయంగా మారతాయి. చమురు దిగుమతులపై భారత్ విపరీతంగా ఆధారపడినందువల్ల క్రూడాయిల్ ప్రభావంతో క్షీణించిన రూపాయి కారణంగా విదేశీ మదుపరులు దేశీయ ఈక్విటీలను అమ్మేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి క్రూడాయిల్ బ్యారెల్ కు 10 డాలర్ల పెరిగితే భారత్ జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.4 శాతం పెరుగుతుంది. వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణంలో ఇంధనాలకు 2.3 శాతం వెయిటేజీ ఉంటుంది. క్రూడాయిల్ ధరలలో ప్రతి 10 శాతం పెరుగుదల ద్రవ్యోల్బణం రేటును 20 బేసిస్ పాయింట్లు పైకి ఎగదోస్తుంది. 

క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల కెమికల్స్, ఆటోమొబైల్, నిత్యావసర వస్తువులు, పెయింట్స్, లూబ్రికెంట్ ఉత్పత్తి సంస్థలు వంటి పరిశ్రమల కార్యశీల పెట్టుబడి అవసరాలు, నిర్వహణ వ్యయం, ముడిసరుకు ఖర్చులను పెంచుతుంది.