చీదరింపులోనూ రికార్డు.. ట్రంప్‌కు సొంత పార్టీ నేతల షాక్..!

చీదరింపులోనూ రికార్డు.. ట్రంప్‌కు సొంత పార్టీ నేతల షాక్..!

అమెరికా ప్రతినిధుల సభలో అధ్యక్షుడు ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను అధ్యక్ష పదవి నుంచితొలగించాలంటూ  ప్రవేశపెట్టిన నూతన అభిశంసన తీర్మానానికి .. ఆదేశ ప్రతినిధుల సభఆమోదం తెలిపింది. భారత కాలమాన ప్రకారం తెల్లవారు జామున మూడుగంటలకు ఓటింగ్ ముగిసింది. 231 మంది సభ్యులు అభిశంసనకు అనుకూలంగా.. 197 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తంగా చూస్తే డెమొక్రాట్లు పూర్తిగా ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేయగా.. రిపబ్లికన్లలో పది మంది .. ట్రంప్‌ నకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో నలుగురు రిపబ్లికన్లు ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సెనెట్‌కు పంపనున్నారు. సెనెట్‌లో రిపబ్లికన్లు స్వల్ప మెజార్టీలో ఉన్నారు. కానీ ఇక్కడ ట్రంప్‌పై మోపిన అభియోగాలు నిరూపించాల్సి ఉంటుంది. ఇక్కడ అభిశంసన ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అంటే రిపబ్లికన్లు కూడా ఓట్లు వేయాలి. కానీ దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. జనవరి 19 వరకు సెనేట్‌ ప్రారంభం కాదని హౌస్‌ లీడర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరిగి.. ఓటింగ్‌ వరకు వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. గతేడాది హౌస్‌లో ఆమోదం పొందిన అభిశంసన తీర్మానం.. సెనేట్‌లో వీగిపోయింది. 

అంతకుముందు.. ట్రంప్‌ను గద్దె దించేందుకు 25 సవరణ ప్రయోగించాలని మైక్‌ పెన్స్‌ను కోరింది దిగువ సభ. డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హౌస్‌ ఆమోదించింది. 223-205 ఓట్లతో తీర్మానం పాస్‌ అయింది. అయితే ఈ అభ్యర్థనను ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తిరస్కరించారు. ట్రంప్‌పై 25వ సవరణను ప్రయోగించేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఈ తీర్మానికి అనుకూలంగా రిపబ్లికన్లు పెద్దగా ఓట్‌ వేయలేదు. పార్టీ లైన్‌ ప్రకారమే ఈ ఓటింగ్‌ జరిగింది. నలుగురు రిపబ్లికన్‌ సభ్యులు గైర్హాజరు కాగా.. ఒకరు మాత్రమే అనుకూలంగా ఓటేశారు. మిగతా వాళ్లు పార్టీ లైన్‌కే కట్టుబడి ఉన్నారు. అమెరికాలో ఏ అధ్యక్షుడు ఎదుర్కోనన్ని విమర్శలు ట్రంప్ ఎదుర్కొన్నారు.అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి తన వివాదాస్పద నిర్ణయాలతో  అపకీర్తి మూటకట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా .. తన ఓటమిని అంగీకరించనంటూ ట్రంప్ నానా రచ్చ చేశారు. ఎన్నికల ఫలితాలను మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ట్రంప్ అనుచరుల క్యాపిటల్‌ హిల్ ముట్టడి.. హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో నలుగురు పోలీసులు , ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ట్రంప్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని కాబోయే అధ్యక్షుడు బైడెన్.. దేశీయ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష భవనంపై దాడి ఘటన వెనక ట్రంప్ హస్తముందంటూ.. ఆయనకు గద్దెదించేందుకు డెమొక్రాట్లు ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.