సన్మానం కొంపముంచింది

సన్మానం కొంపముంచింది

 

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం సద్దుమణగక ముందే అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని కుదిపేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వ్యవహారంలో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. యాంకర్లను, హీరోయిన్లను అమెరికా రప్పించి చికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ నడిపిస్తున్న తెలుగు జంటను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని వివిధ తెలుగు, భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల కోసమంటూ తప్పడు పత్రాలతో అధికారులను మోసం చేసి... టాలీవుడ్ ఆర్టిస్టులను రప్పించి వారితో వ్యభిచారం చేయించారని ఫెడరల్ పోలీసులు తమ అభియోగ పత్రాల్లో ఆరోపించారు.
 
చార్జిషీటులో బాధితురాళ్ళను 'ఎ, బి, సి, డి, ఇ’ అని ప్రస్తావించిన అమెరికా పోలీసులు... గలీజు దంధా జరిగిన తీరును పూసగుచ్చినట్లు వివరించారు. కిషన్ మోదుగుముడి ఈ సెక్స్ రాకెట్ సూత్రధారి అని.. ఇతడికి శ్రీరాజ్ చెన్నుపాటి, రాజు అనే మారు పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అతడి భార్య చంద్రకళ పూర్ణిమ మోదుగుమూడి అలియాస్ ‘విభా, విభా జయం’ ఈ రాకెట్‌లో భాగస్వామి అని తెలిపారు. 

గుట్టు ఎలా రట్టయింది?

 

ఈ సెక్స్ రాకెట్ ఎలా పనిచేసేది అఫిడవిట్‌లో పూసగుచ్చినట్టు వివరించారు. బీ1, బీ2 విజిటర్ వీసాలతో టాలీవుడ్ హీరోయిన్లు, మోడళ్లు, యాంకర్లను అమెరికా తీసుకెళ్తారు. అక్కడ వారికి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వ్యభిచారం చేయిస్తారు. ఓ బాధితురాలి చిన్న తప్పిదంతో ఈ పాపాలపుట్ట బద్దలైంది.

2017 నవంబర్ 20న ఢిల్లీ నుంచి వచ్చిన ఒక విమానంలో ఒక యువతి చికాగోలోని ఓ‘హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఆమె ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి బి1/బి2 తాత్కాలిక వీసా పొందింది. ఆమె విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులకు సమర్పించిన పత్రం ప్రకారం.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టీఏఎస్‌సీ) 2017 నవంబర్ 18న ఆమె సన్మాన కార్యక్రమానికి వస్తున్నట్టు.. పది రోజులు కాలిఫోర్నియాలో ఉంటుందని ఉంది.

అయితే ఆమె వీసా ఇవ్వటానికి ఆధారమైన పత్రంలో కార్యక్రమం నవంబర్ 18 అని ఉండటం.. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె అమెరికా రావటం..పైగా  కాలిఫోర్నియాకు కాకుండా చికాగోకు ఆమె రావటంతో ఇమిగ్రేషన్ అధికారులు అనుమానించారు. మొత్తం గుట్టు రట్టు కావడానికి ఈ అనుమానమే కారణం. ఈ విషయాన్ని ఆమె వద్ద అధికారులు ప్రస్తావించగా... తాను ఇప్పుడు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) నిర్వహిస్తున్న వేరే సమావేశంలో పాల్గొనటానికి వచ్చానని ఆమె అధికారులకు చెప్పారు. ఇలినాయిస్ లోని షామ్‌బర్గ్‌లో 2017 నవంబర్ 25న జరిగే సదస్సులో అతిథిగా పాల్గొంటోందని తెలిపే లేఖను ఆమె ఇమిగ్రేషన్ అధికారులకు చూపారు.

అయితే ఆ సొసైటీ ప్రతినిధులను పోలీసులు కలిశారు.అలాంటి మీటింగ్ ఏదీ లేదంటూ వాళ్లు చెప్పారు. దీంతో పోలీసులు ఈ కేసులో పట్టుబిగించారు. అధికారులు టీఏఎస్‌సీ ప్రెసిడెంట్‌ను సంప్రదించగా.. నవంబర్ 18న కాలిఫోర్నియాలో సదస్సును నిర్వహించామని.. అయితే ఆ నటిని తాము ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత అధికారులు నాట్స్ ప్రతినిధులను ప్రశ్నించగా వారు ఆ నటి గురించి తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. పైగా నవంబర్ 25న తామే సదస్సు నిర్వహించటం లేదని చెప్పారు. ఆమె చెప్పిన ‘రినయసెన్స్ కన్వెన్షన్ సెంటర్’లో ఆ రోజు ఏ కార్యక్రమం జరగలేదని అధికారులు నిర్ధారించుకున్నారు.

దీంతో ఆమె అధికారులకు నిజాలు గడగడా చెప్పేసింది.  టీఏఎస్‌సీ, నాట్స్ లేఖలను తనకు ‘రాజు’ అనే పరిచయస్తుడు ఇచ్చారని తెలిపింది. అమెరికా ప్రయాణానికి విమానం టికెట్‌, హోటల్ రూమ్‌కు అతడే డబ్బులు చెల్లించాడని.. పత్రాలను ఈమెయిల్ ద్వారా పంపించాడని ఆమె వివరించింది. అతడు తనను విమానాశ్రయం వద్ద పికప్ చేసుకోవాల్సి ఉందని చెప్పింది. తన దగ్గర ఉన్న అతడి కాంటాక్ట్ నంబర్‌ను, అతడి [email protected] అనే ఈమెయిల్ ఐడీని అధికారులకు ఇచ్చింది. 

వెబ్‌సైట్‌ కథనంతో ట్విస్ట్‌...

ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా ఇంటర్నెట్ లో వెతకగా అతను నకిలీ వీసాలపై యువతులను అమెరికా తీసుకెళ్లి సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని, చికాగో ఇతని కేంద్రం ఉన్నట్టు ఇండియాగ్లిట్జ్ అనే వెబ్ సైట్ కథనం కనిపించింది. 

దీంతో ఆ నటికి అమెరికాలో ప్రవేశం నిరాకరించిన అధికారులు ఆమె వీసాను రద్దు చేశారు. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ (.....6887 ముగిసే), ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా పరిశోధించగా.. అవి ‘కిషన్ మోదుగుమూడి’ అనే వ్యక్తివని తేలింది. టెలిఫోన్ సర్వీస్ సంస్థ ఏటీ&టీ దగ్గర వివరాలు చూడగా అతడికి .......3114తో ముగిసే మరో నెంబర్ కూడా ఉన్నట్టు తెలిసింది. దీని ద్వారా టెలికాం ఆపరేటర్‌ క్యామ్ క్యాస్ట్ వినియోగించేవాడు.

గూగుల్ నుంచి సంపాదించిన పత్రాలు సైతం [email protected],  [email protected] అనే ఈ-మెయిల్ ఐడీలు ఒకే వ్యక్తివని స్పష్టం చేశాయి. ఫోన్ నుంచి మెయిల్ చేసేందుకు వాడిన ఫోన్ నెంబర్లు అధికారుల దగ్గర ఉన్న నెంబర్లు ఒకటే. కిషన్ పేరు మీద తీసుకున్న ఇంటర్నెట్ కనెక్షన్ ఐపీ అడ్రస్ కూడా అదేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఒకే వ్యక్తి రెండు ఫోన్ నెంబర్లు, రెండు మెయిల్ ఐడీల ద్వారా ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు గుర్తించిన అధికారులు .. చికాగోలోని అతడి నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు.