బూడిద నుంచి ఎరువు

బూడిద నుంచి ఎరువు

ఒక ఐడియా అద్భుతంగా పనిచేసింది. గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన బొగ్గు పొడి నుంచి పంటలకు పనికొచ్చే ఎరువును సృష్టించింది. చైనాలోని బీజింగ్ పట్టణ శివార్లలో ఓ పవర్ ప్లాంట్ నడుస్తూంది. అయితే అది బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్ కాబట్టి సహజంగానే బూడిద  (దాదాపు 130 ఎకరాల్లో) పేరుకుపోయింది. ఆ బూడిదను  ఏం చేయాలా అని ఆలోచించిన మీదట కొన్నేళ్ల క్రితం దాన్నుంచి ఇటుకలు తయారు చేశారు. కానీ టెక్నాలజీ పెరిగిన తరువాత యాష్ బ్రిక్స్ వాడకం తగ్గిపోవడంతో బూడిద గుట్టలుగుట్టలుగా పేరుకుపోయింది. ఆ కారణంగా ఎండాకాలంలో బూడిద గాల్లో కలిసిపోయి వాతావరణ కాలుష్యానికి దారితీసింది. సమీప ప్రాంతాల ప్రజలకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. సమస్య తీవ్రరూపం దాలుస్తున్నా పరిష్కారానికి ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. 

అయితే లియు కీఫెంగ్ అనే 63 ఏళ్ల ప్రొఫెసర్ కి మాత్రం అదో అద్భుతమైన వనరులా కనిపించింది. ఆయన దాని మీద దాదాపు 30 ఏళ్లపాటు పరిశోధనలు చేసి ఉన్నాడు. ఆయనకి ఈ రాశి కనిపించగానే... వెతుకుతన్నదేదో కాలికి తగిలినట్లపించింది. కీఫెంగ్, ఆయన టీమ్ ఆ బూడిదను ఉపయోగించి 2017లో ఓ కొత్త రకమైన సారవంతమైన మట్టిని తయారు చేశారు. పుట్టగొడుగులు,  ఎండుగడ్డి, జంతువుల పెంట, రంపపుపొట్టుతో ఈ బూడిదను కలిపి ఓ నిర్దిష్టమైన టెంపరేచర్ లో ప్రాసెస్ చేశారు. అప్పుడా బూడిదకు అద్భుతమైన జీవశక్తి లభించింది. ఆ కృత్రిమ మట్టిని ఎరువుగా వాడి అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నారు. లాన్లలో, డాబాల మీద ఆ మట్టిని వాడుతూ కూరగాయలు పెంచుతున్నారు. మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు.. గోల్ఫ్ కోర్సుల్లో, ఫుట్ బాల్ మైదానాల్లో, టెన్నిస్ కోర్టుల్లో, గార్డెన్స్ లో విరివిగా వాడుతూ బూడిదను సద్వినియోగం చేయడమే గాక పొల్యూషన్ ను అరికడుతున్నారు. 

ఈ కృత్రిమ మట్టి ద్వారా పంటకు అయ్యే ఖర్చు సగానికి సగం తగ్గిపోవడం విశేషం. దీని ద్వారా బీజింగ్ పట్టణంలోని సగం బిల్డింగ్స్ మీద గ్రీనరీని ఏర్పాటు చేయవచ్చట. ఈ వార్తకు చైనాలోని జిన్హువా న్యూస్ మంచి ప్రియారిటీ ఇచ్చింది. 

(ఫొటోలు: జిన్హువా న్యూస్ సౌజన్యంతో)