తృణ ధాన్యాల విలువ తెలుస్తోంది

తృణ ధాన్యాల విలువ తెలుస్తోంది

ఒకప్పుడు వరి అన్నం తీసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. వారమంతా జొన్న, రాగి వంటి తృణధాన్యాలతో రొట్టె చేసుకొని తినేవారు. అడపా దడపా బియ్యం వండుకొని భోజనం చేసేవారు. అయితే గ్రీన్ రివల్యూషన్ కారణంగా సాగునీటి సౌకర్యాలు పెంచుకొని వరి సాగును గణనీయంగా పెంచుకొని ప్రతిరోజూ అన్నమే తింటున్నాం. దీంతో జొన్నలు, రాగులతో రొట్టె, అంబలి వంటి సంప్రదాయ వంటకాలు కాలగమనంలో కలిసిపోయాయి. గత 50 ఏళ్లలో తృణధాన్యాలు కనుమరుగైపోయి వరి, గోధుమ దూసుకొచ్చేసింది. తృణధాన్యాలకు ఉండే సహజమైన లక్షణం ఆలస్యంగా జీర్ణమైపోవడం. వాటితో షుగర్, గుండెజబ్బులు వంటివి సమీపించేవి కావు. వాటితో పోలిస్తే వరి అన్నం చాలా త్వరగా జీర్ణమైపోతుంది. కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల క్యాలరీలు పెరిగిపోయి నానారకాల జబ్బులకు గురవుతున్నారు. దీనికి విరుగుడుగా ఇప్పుడు వైద్యులంతా మళ్లీ తృణధాన్యాల వాడకాన్నే ప్రమోట్ చేస్తుండడంతో ప్రజల్లో అవగాహన బాగా పెరిగిపోతోంది. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లలో, వీధుల్లో దొరికే తినుబండారాల్లో కూడా తృణ ధాన్యాల వేరియెంట్స్ లభిస్తున్నాయి. 

కర్నాటక, రాయలసీమ, తెలంగాణ వంటి ప్రాంతాల్లో రెండు తరాలకు పూర్వం జొన్నన్నం, రాగి సంకటి, జొన్న రొట్టె వంటివి విరివిగా ఉపయోగించేవారు. తెలంగాణలో అయితే జొన్న అంబలి, రాగి అంబలి ఇంటింటికీ తయారు చేసేవారు. అంతేకాదు.. తృణధాన్యాలతో కూడిన ఇలాంటి స్థానిక ఆహారాలనే ఉత్తర భారతదేశమంతా కూడా వాడేవారు. అయితే గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇన్ స్టంట్ ఫుడ్స్ కు అలవాటు పడిపోయి.. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు గాడి తప్పాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పుడు ఎవర్ని పలకరించినా షుగర్ బాధితులే కనిపిస్తున్నారు. 1990-2016 వరకు తీసుకుంటే 80 శాతం షుగర్ పేషెంట్లు పెరిగిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందుకే వరికి బదులు వైద్యులు రాగులు, జొన్నలు, కొర్రలు వంటి తృణ ధాన్యాలతో కొత్తకొత్త రకాల వంటలు చేసుకొని ఆస్వాదించాలని సూచిస్తున్నారు. వారి ప్రేరణతోనే కర్నాటకలో రాగి లడ్డూ, రాగులతో చేసిన పూరీ వంటివాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రెస్టారెంట్లలో, హెటళ్లలో సేల్స్ చేయడం ద్వారా పాపులారిటీ కూడా కల్పిస్తున్నారు. ప్రతియేటా తృణధాన్యాల ప్రదర్శనలు, అమ్మకాల కోసం ప్రత్యేకమైన కౌంటర్లు తెరుస్తున్నారు. ఈ సంవత్సరమైతే నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా నిర్ణయించారు. ఇలా క్రమంగా తృణధాన్యాల వాడకం గణనీయంగా పెరుగుతోంది. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం కావాలి కదా. పెద్దలు ఇలాంటి ఆహారానికి అలవాటుపడితే పిల్లలు ఆటోమేటిగ్గా తృణ ధాన్యాలకు అలవాటుపడతారని డాక్టర్లు సూచిస్తున్నారు.