ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది

ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది

ఉద్యోగావకాశాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఈరోజు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన విషయాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. 

టీఎస్‌పీఎస్సీ వద్ద 19 లక్షల మంది ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, దీనిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉత్తమ్‌ అన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) ద్వారా రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి.. 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని అన్నారు. 2014, 2015 శాసనసభ వేదికగా ప్రసంగాల్లో గవర్నర్‌ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారని చెప్పారు. మరి ఆ పెట్టుబడి, ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

2014 జూన్‌ 2 అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వచ్చినప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయని ఉత్తమ్‌ అన్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవాచేశారు. ఉద్యోగ నియామక సంస్థ టీఎస్‌పీఎస్సీలో సైతం ఖాళీలు ఉన్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ దే అధికారమని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మెగా డీఎస్సీ పేరుతో 20 వేల పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు.