'ప్రతిపక్షంగా ఎంఐఎం.. ఇదీ కేసీఆర్‌ కుట్ర!'

'ప్రతిపక్షంగా ఎంఐఎం.. ఇదీ కేసీఆర్‌ కుట్ర!'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యేనూ కొనేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇవాళ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ కోరారు.  ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అనుమతిలేకుండా సీఎల్పీ విలీనం కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆనాడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్... ఇప్పుడు ఆ పార్టీని విలీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీగా చేసే కుట్రలో భాగంగానే సీఎల్పీ విలీన కుట్రకు తెరతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బలహీనత లేదని...నేతలే అమ్ముడు పోతున్నారని ఉత్తమ్‌ అసహనం వ్యక్తంచేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏం చెప్పారో అర్ధం కావడం లేదన్న ఉత్తమ్‌.. ఆయన కనీసం హైదరాబాద్‌ రావడానికే భయపడుతున్నారని.. పార్టీ మారిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని నోటీసులు ఇచ్చినా ఆయన తీసుకోవడం లేదని అన్నారు.