సీఎంని నిలదీసిన టీచర్ అరెస్ట్‌

సీఎంని నిలదీసిన టీచర్ అరెస్ట్‌

తనను బదిలీ చేయాలని నలుగురిలో నిలదీసిన మహిళా ఉపాధ్యాయురాలిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అరెస్ట్ చేయించారు. అంతే కాకుండా తనను అసభ్య పదజాలంతో దూషించిన ఆమెను తక్షణమే సస్పెండ్ చేశారు. గురువారం రాజధాని డెహ్రాడూన్ లో సీఎం జనతా దర్బార్ జరుగుతున్న సందర్భంగా జరిగిన ఘటన తాలుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది.

ఉత్తరకాశి జిల్లా నౌగావ్ లో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు ఉత్తర బహుగుణ. మూడేళ్ల క్రితం భర్త మరణించాడు. 25 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేసి రిటైర్మెంట్ కి దగ్గరైన తనను పిల్లలతో కలిసి ఉండేందుకు డెహ్రాడూన్ కి ట్రాన్స్ ఫర్ చేయాలని జనతా దర్బార్ లో సీఎంని కోరారు. అయితే ముఖ్యమంత్రి ఆమె వినతిని తోసిపుచ్చారు. దీంతో వాగ్వాదానికి దిగిన ఆమె బిగ్గరగా సీఎంను అసభ్య పదజాలంతో దూషించారు. రావత్ కు వేలు చూపించి పరుషంగా మాట్లాడింది. దీంతో సహనం కోల్పోయిన త్రివేంద్ర సింగ్ ఆమెను హాల్‌ నుంచి బయటకు తీసుకెళ్లాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందిని కోరారు. అప్పటికి ఉత్తర బహుగుణ అలాగే ప్రవర్తించటంతో  ‘సీఎం ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అంతరాయం కల్గించిందనే నేరం’ కింద పోలీసులు బహుగుణను అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత ఆమెను బెయిల్‌ పై విడుదల చేశారు. సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ఉత్తర బహుగుణపై సస్పెన్షన్ వేటు వేశారు.