రాందేవ్‌ బాబా... స్వదేశీ ముసుగు వొద్దు

రాందేవ్‌ బాబా... స్వదేశీ ముసుగు వొద్దు

బాబా రామ్‌ దేవ్‌కు ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. స్వదేశీ ముసుగుతో కంపెనీ లాభాల్లో రైతులకు ఇవ్వాల్సిన వాటాను ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రకృతిలో లభించే కొన్ని జీవ వనరులను కొన్ని సామాజిక వర్గాలు కాపాడుకుంటూ వస్తుంటాయి. అలాంటి జీవ వనరులను వాణిజ్యానికి ఉపయోగించే పక్షంలో... వచ్చిన లాభాల్లో కొంత వాటాను సదరు సామూహిక వర్గాలకు ఇవ్వాల్సిందేనని బయో డైవర్సిటీ యాక్ట్‌ (జీవ వైవిధ్య చట్టం) 2002 స్పష్టం చేస్తోందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

రాందేవ్‌ బాబాకు చెందిన దివ్య ఫార్మసీ అనే కంపెనీ శతాబ్దాలుగా కొన్ని సామూహిక వర్గాలు సంరక్షించిన జీవ వనరులను ఉపయోగించి పలు ఆయుర్వేదిక్‌, హెర్బల్‌ ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతోంది. 2014-15లో రూ. 421 కోట్ల ఆదాయన్ని కంపెనీ ఆర్జించింది. ఇందులో 2.04 కోట్లను బయో డైవర్సిటీ యాక్ట్‌ కింద కంపెనీ చెల్లించాలని ఉత్తరాఖండ్‌ స్టేట్‌ బయోడైవర్సిటీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని కోర్టులో సవాలు చేసింది దివ్య ఫార్మసీ. తమది స్వదేశీ కంపెనీ అని... లాభాల్లో వాటా ఇవ్వడం అటుంచి... జీవ వనరులు ఉపయోగించడానికి ప్రభుత్వం నుంచి కూడా తాము ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించింది. అయితే కంపెనీ స్వదేశీ వాదనను కోర్టు అంగీకరించలేదు. కచ్చితంగా లాభాల్లో వాటా ఇవ్వాల్సిందేనని జస్టిస్‌ సుదాన్షు ధుల్లా స్పష్టం చేశారు. దీంతో దివ్య ఫార్మసీతోపాటు రాందేవ్‌ బాబాకు చెందిన పలు కంపెనీలు కూడా తమ లాభాల్లో రైతులకు లేదా సామూహిక వర్గాలకు పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.