మంత్రి భార్యకు కరోనా.. మంత్రి సహా 41 మంది క్వారంటైన్‌కి..!

మంత్రి భార్యకు కరోనా.. మంత్రి సహా 41 మంది క్వారంటైన్‌కి..!

కరోనాకు రాజు, మంత్రి అనే తేడా లేదు.. ఎవ్వరు దొరికితే వారిని పట్టేస్తోంది.. తాజాగా.. ఉత్తరాఖండ్‌ పర్యటక శాఖ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ భార్య, మాజీ మంత్రి అమృత రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేల్చారు వైద్యులు.. అస్వస్థతకు గురైన అమృత రావత్‌ నమూనాలను సేకరించిన వైద్యులు... డెహ్రాడూన్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అయితే, నివేదికలో ఆమె కరోనాబారిన పడినట్టుగా నిర్ధారించారు. ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇక, మంత్రి భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మంత్రి సత్పాల్ మహారాజ్‌తో పాటు నలభై మందిని హోం క్వారంటైన్‌లో పెట్టారు. మరోవైపు.. తన భార్యకు కోవిడ్ 19 పాజిటివ్‌గా ధృవీకరించారు మంత్రి.. నా భార్యకు గత మూడు, నాలుగు రోజులుగా జ్వరం వచ్చింది. మొదట, ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహించాం.. నెగిటివ్‌గా వచ్చింది.. మళ్లీ శనివారం కోవిడ్ -19 పరీక్షలు చేయించడంతో.. పాజిటివ్‌గా వచ్చిందన్నారు. తన కుటుంబం, భార్యతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య శాఖ ప్రోటోకాల్‌ను అనుసరించి నిర్బంధంలోకి వెళతారని మంత్రి చెప్పారు. చికిత్స కోసం తన భార్యను ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మరో 22 మంది శనివారం కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చింది.. దీంతో.. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 749 కి చేరుకుంది. కొత్తగా నమోదైన 22 కేసుల్లో.. 14 డెహ్రాడూన్, 3 హరిద్వార్, 5 నైనిటాల్‌లో నమోదైనట్టు అధికారులు తెలిపారు.