గవర్నర్ పగ తీర్చుకుంటున్నాడా..?

గవర్నర్ పగ తీర్చుకుంటున్నాడా..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎంతటి ఉత్కంఠను రేపాయో.. ఫలితాలు వచ్చాకా అంతకు మించిన ఆసక్తిని కలిగిస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరు భావించారు. కానీ ఆ తర్వాతి నిమిషం నుంచి కాంగ్రెస్, జేడీఎస్‌లు పుంజుకున్నాయి. చివరకు ఫలితాలు ముగిసిన తర్వాత చూస్తే.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు కొద్ది అడుగుల దూరంలో చతికిలపడింది.

అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారడంతో ఆ పార్టీతో బేరాసారాలు మొదలెట్టేశాయి కాంగ్రెస్, బీజేపీలు. అయితే జేడీఎస్‌ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా మద్ధతిస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించడంతో.. కుమారస్వామి సీఎం అవుతారని అందరూ భావించారు.. ఈ తరుణంలో పంచాయతీ రాజ్‌భవన్‌కు చేరింది.

అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాలా...? లేక ఎమ్మెల్యేల బలంలో పై చేయిలో ఉన్న  జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని పిలవాలా అన్నది తేల్చుకోలేక గవర్నర్ కాస్తంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని.. కాదు కాదు గవర్నర్ బీజేపీ వ్యక్తి కావడం వల్లే కాలయాపన చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్లు చేశారు.. 22 ఏళ్ల క్రితం నాటి ఘటనకు ప్రతీకారం తీర్చుకునే విధంగా ప్రస్తుత కర్ణాటక గవర్నర్ వ్యవహరిస్తున్నారన్నది వాటి సారాంశం..

1996 సమయంలో కేశూభాయ్ పటేల్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీని చీల్చి.. రిసార్టులో క్యాంపు రాజకీయాలు నడిపి అసమ్మతి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మద్ధతుతో.. శంకర్ సింగ్ వాఘేలా సీఎం అయ్యారు. కాంగ్రెస్-వాఘేలాల మధ్య మనస్పర్థలు రావడం.. ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ప్రభుత్వం పడిపోవడంతో.. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడంతో కేంద్రప్రభుత్వం గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విధించింది. అయితే ఆ సమయంలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుత కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఉండగా.. ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా సిఫారసు చేసింది.. జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ.

నాడు బీజేపీ ప్రభుత్వం కూలిపోవడానికి సూత్రధారులుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ అధినేత దేవేగౌడలు ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో తన వద్దకే రావడంతో వాజుభాయ్ దీనిని అవకాశంగా తీసుకున్నారని.. అదే కర్మ సిద్ధాంతమని.. టైమ్ ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదని.. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా నాటి నెహ్రూ నుంచి నేటి వరకు నీతి, నిజాయితీలను, రాజ్యాంగ విలువలను పక్కనబెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉన్నారంటూ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.