తీరుమార్చుకున్న వంగవీటి రాధా..? టచ్‌లోకి హర్షకుమార్..!

తీరుమార్చుకున్న వంగవీటి రాధా..? టచ్‌లోకి హర్షకుమార్..!

వంగవీటి రాధా. చాలా బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా.. ఆ ఫ్లేవర్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజకీయంగా కీలక పాత్ర పోషించే బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆ కుటుంబం వెంట నడిచేందుకు అనుచరగణం సిద్దంగా ఉన్నా.. ఆ స్థాయి ఇమేజ్‌ను రాధా సంపాదించుకోలేకపోయారు. ఇందుకు వరుస ఓటములు కూడా కారణేనని తెలుస్తోంది. ఓ మాదిరి విషయాలపై స్పందించేందుకు రాధా ముందుకు రారు. అలాగే ఎంత పెద్ద విషయాన్నైనా సరే.. సాగదీసి దాన్నుంచి రాజకీయ లబ్ది పొందే ఆలోచన కూడా ఉండదు. అయితే అలాంటి వంగవీటి రాధాలో ఇప్పుడు ఎందుకో మార్పు కన్పిస్తోంది. రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చినా.. రాజధాని గ్రామాల్లో రెగ్యులరుగా పర్యటిస్తున్నారు. వారికి సంఘీభావం తెలుపుతున్నారు. అలాగే నిత్యం అమరావతి జేఏసీ నేతలతో టచ్‌లో పాల్గొంటున్నారు. ఇక విజయవాడలో ప్రతి రోజూ రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నారు వంగవీటి రాధా. అంతే కాకుండా.. పక్క జిల్లాలకు వెళ్లి మరీ రాజధాని ఉద్యమానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు రాధా. దీంట్లో భాగంగా మాజీ ఎంపీ హర్ష కుమార్‌తో కలిసి రావులపాలెంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు.

అమరావతి ఉద్యమం గురించిన చర్చ ఓ ఎత్తు అయితే.. వంగవీటి రాధా-హర్షకుమార్‌ కాంబినేషన్‌ మరో ఎత్తు. ఇప్పుడు వీరిద్దరు అమరావతి ఉద్యమం కోసం ఏదో ఓ ర్యాలీ చేపట్టి సరిపెడతారా..? లేక ఈ బంధాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. హర్ష కుమార్‌ జైలు నుంచి బయటకు వచ్చింది మొదలు జగన్‌.. వైసీపీని టార్గెట్‌ చేసుకుని వరుస కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అమరావతి ఉద్యమం పేరుతో వంగవీటి రాధా సైలెంటుగా జనంలో ఉంటూ తన పని కానిచ్చేస్తున్నారు. సహజంగా వీరి కలయికను సాధారణ అంశంగానే చూడాల్సిఉన్నప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు.. ప్రత్యేకించి వంగవీటి రాధాలో వచ్చిన మార్పు చూస్తుంటే భవిష్యత్‌లో ఏదో కీలక పరిణామాలు చోటు చేసుకుబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటు వంగవీటి రాధా, అటు హర్షకుమార్‌ ఇద్దరు బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వారి వారి వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నికల సమయంలో ఎంత మేర వారితో కలిసి వచ్చారనే విషయం పక్కన పెడితే.. ప్రస్తుతమున్న పరిస్థితులను తమకు అనుకూంగా మలుచుకునే దిశగా ఈ నేతలమైనా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారా..? అనే చర్చ జరుగుతోంది.

కాపు సామాజికవర్గంలో వంగవీటి కుటుంబానికి.. అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో.. ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లాలో హర్షకుమార్‌కు చెప్పుకోదగ్గ పేరు ఉంది. వారు ప్రభావితం చేసే పరిస్థితిలోనే ఉంటారు. ఈ క్రమంలో వీరిద్దరు ఇప్పటి నుంచి కలిసి పని చేస్తే.. భవిష్యత్తులో ప్రభావితం చేయలేరా..? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వీరి వెనుక ఎవరు ఉన్నారో అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నారు. టీడీపీకి సంబంధించిన యాక్టివిటీస్‌లో వంగవీటి రాధా పెద్దగా పాల్గొనకున్నా.. ఇటీవల కాలంలోనే ఒకటికి రెండుసార్లు చంద్రబాబు, లోకేష్‌తో భేటీ అయ్యారు వంగవీటి రాధా. ఆ తర్వాత నుంచే రాజధాని గ్రామాల్లో వంగవీటి పర్యటనలు చేపడుతున్నారు. అమరావతి ఉద్యమంలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. మరోవైపు హర్షకుమార్‌ కూడా ఎన్నికల ముందు టీడీపీలో చేరినా.. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఇక హర్షకుమార్‌ను తిరిగి తమ ట్రాక్‌లో వచ్చేలా చేయడానికి టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్‌ వెనుక టీడీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. అత్యంత బలమైన స్థానంలో అధికార పార్టీ ఉంది. మరోవైపు బీజేపీ కేంద్రంలో తనకున్న అధికారంతో ఏపీలో రాజకీయం చేస్తోంది. ఇక జనసేన బీజేపీతో జతకట్టింది. ఈ క్రమంలో వివిధ వర్గాలను తమవైపు తిప్పుకునేలా చేయాలంటే కచ్చితంగా రకరకాల కాంబినేషన్లను వర్కవుట్‌ చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ భావిస్తోంది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ గేమ్‌ ప్లాన్‌ సిద్దం చేస్తున్నట్టు కన్పిస్తోంది.