పవన్‌తో వంగవీటి రాధా భేటీ అందుకేనా..?

పవన్‌తో వంగవీటి రాధా భేటీ అందుకేనా..?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం జరిగింది... ఓవైపు టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తుంటే.. మరోవైపు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవడం హాట్ టాపిక్‌ అయ్యింది. విజయవాడలో ఉన్న జనసేనానిని కలిసిన వంగవీటి రాధా.. అరగంటకు పైగా చర్చలు జరిపారు. ఇక, వంగవీటి రాధా.. జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలో చేరే విషయంపై చర్చించడానికే ఆయన పవన్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన వంగవీటి రాధాకృష్ణ.. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీకి గుడ్‌బై చెప్పి సైకిలెక్కారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకపోయినా... టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకు కీలక పోస్టు రావడం పక్కా అనే ప్రచారం సాగింది. అయితే, టీడీపీ ఘోర పరాజయం చవిచూడడం... వైసీపీ అధికారంలోకి రావడంతో అంతా రివర్స్ అయిపోయింది. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న వంగవీటి.. జనసేన పార్టీలో చేరేందుకే సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది.