ఎన్‌టీఆర్ సినిమాలో జయమ్మ..?

ఎన్‌టీఆర్ సినిమాలో జయమ్మ..?

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ వరుస సినిమాలను ఓకే చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొమరం బీమ్ పాత్రలో కనిపించనున్న ఎన్‌టీఆర్ తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో గొప్ప నటి చేరనున్నారంట. ఈ ఏడాది క్రాక్ సినిమాతో అందరినీ మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారంట. దర్శకుడు త్రివిక్రమ్ కూడా వరలక్ష్మిని సినిమాలోకి స్వాగతించేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే పేరు ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఈ పేరును ఫిక్స్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారంట. ఇదివరకే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చేశారు. అందుకే ఇప్పుడు ఎన్‌టీఆర్30లో కూడా ఉపేంద్ర చేసేందుకు ఓకే చెప్పారంట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలోని నటీనటుల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాల కోసం అప్పటి వరకు వేచి చూడాల్సిందే.