శ్రద్దా కపూర్ పెళ్లిపై హింట్ ఇచ్చిన వరుణ్..

శ్రద్దా కపూర్ పెళ్లిపై హింట్ ఇచ్చిన వరుణ్..

కరోనా వచ్చినా, కళ్యాణం వచ్చినా ఆగేది కాదు. సామెత కాస్త మారింది కదా! ఫర్లేదులెండీ! ఈ మధ్య పరిస్థితి అలాగే తయారైంది. మన తెలుగు సినీ సెలబ్రిటీలే కాదు బాలీవుడ్ వాళ్లు కూడా వెడ్డింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు... కరోనా ఎఫెక్ట్‌తో బాలీవుడ్‌లో లెటెస్ట్‌గా యంగ్ హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటి వాడయ్యాడు. ఆన్ స్క్రీన్ బ్యూటీని కాకుండా నటాషా దలాల్ అనే ఫ్యాషన్ డిజైనర్‌ని పెళ్లాడాడు. వీరిద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందని ముంబై గ్లామర్ ప్రపంచంలో అందరికీ తెలిసిందే. గత కొన్నాళ్లుగా వరుణ్ ధవన్ అభిమానులకి కూడా నటాషా గురించి తెలిసిపోయింది. అందుకే, తమ బహిరంగ రహస్యాన్ని బ్యాండ్ బాజా బారాత్ దాకా తీసుకొచ్చేశారు. అయితే, ఓ హీరో పెళ్లి అన్నాక ఇండస్ట్రీలో హడావిడి మామూలుగా ఉంటుందా? సొషల్ మీడియాలో వెడ్డింగ్ ఆఫ్ వరుణ్ ట్రెండింగ్ గా మారిపోయింది!
వరుణ్‌ ధవన్ కి బోలెడు మంది బాలీవుడ్ సెలబ్స్ శుభాకాంక్షలు చెప్పారు. అయితే, అందరిలోనూ ఒక్కాయన వెడ్డింగ్ విషెస్ కాస్త డిఫరెంట్ గా నిలిచాయి. అయితే, ఈయన బాలీవుడ్ సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీల ఫోటోషూట్స్ చేసే... స్టార్ ఫోటోగ్రాఫర్! పేరు రోహన్ శ్రేష్ఠ. 
రోహన్ గురించి జనం ప్రత్యేకంగా మాట్లాడుకోవటానికి కారణం, ఆయన బీ-టౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ కావటమే. 2019లో ఓ సారి ఫోటోషూట్ చేయించుకున్న మన ‘సాహో’ బ్యూటీ అమాంతం కెమెరా మ్యాన్ కి పడిపోయిందట. అలా మొదలైన శ్రద్ధా, రోహన్ రొమాన్స్ బాలీవుడ్ లో బహిరంగ రహస్యమని ప్రత్యేకంగా చెప్పాలా? శ్రద్ధకి వరుణ్ ధవన్ చిన్న నాటి నుంచీ మంచి మిత్రుడు కావటంతో ఈయనకి కూడా మొత్తం డేటింగ్ వ్యవహారమంతా తెలుసట!
చాలా కాలం గాళ్ ఫ్రెండ్ నటాషాతో డేటింగ్ చేసి ఎట్టకేలకు జనవరి 24న పెళ్లి చేసుకున్న వరుణ్‌ తనకు వివాహా శుభాకాంక్షలు చెప్పిన ప్రతీ ఒక్క సెలబ్రిటీకి పర్సనల్ గా రిప్ల్సై ఇచ్చాడు. అదే క్రమంలో రోహన్ శ్రేష్ఠకి కూడా సమాధానం ఇచ్చాడు. ఇంతకీ, రోహన్ ఏమన్నాడంటే... వరుణ్ నువ్వు లక్కీ గై... అన్నాడు. దానికి జవాబు ఇచ్చిన ధవన్ కూడా... అవును నేను లక్కీనే. నువ్వు కూడా అదృష్టవంతుడివి అయ్యేందుకు రెడీ అవ్వు... అన్నాడు! దీనర్థం శ్రధ్ధాతో సరసాన్ని సంసారంగా మార్చేసుకోమనే అంటున్నారు బాలీవుడ్ జనం!
శ్రద్ధా, రోహన్ శ్రేష్ఠ 2020లోనే పెళ్లాడతారని ఆ మధ్య పుకార్లు గట్టిగా వినిపించాయి. కరోనా లాక్ డౌన్ లోనే వీరి కళ్యాణం అవుతుందని అంతా భావించారు. కానీ, ఇంకా మన మిస్ ‘సాహో’ మిసెస్ కాలేదు. చూడాలి మరి, ఈ సంవత్సరంలోనైనా వరుణ్ ధవన్ చెప్పినట్టు పెళ్లాడతారో లేదో!