మహిళల టీ20 ఛాలెంజ్ః వెలాసిటీ జట్టు విజయం 

మహిళల టీ20 ఛాలెంజ్ః వెలాసిటీ జట్టు విజయం 

ఐపీఎల్‌ మహిళల టి20 చాలెంజ్‌లో భాగంగా జైపూర్ లో బుధవారం ట్రయల్‌ బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. బ్లేజర్స్‌ నిర్దేశించిన 113 పరుగుల స్వల్స లక్ష్యాన్ని ఛేదించడానికి మిథాలీ సేన చెమటోడ్చింది. షేఫాలీ వర్మ(34; 31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌), వ్యాట్‌(46; 35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో వెలాసిటీ విజయాన్ని అందుకుంది. వీరిద్దరూ ఔటైన తర్వాత వెలాసిటీ వికెట్లు త్వరగా పడిపోయాయి. చివర్లో మిథాలీ రాజ్‌(17) రాణించడంతో వెలాసిటీ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీప్తి శర్మ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, గైక్వాడ్‌, డియోల్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌ బ్లేజర్స్‌కు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన 10 పరుగులకే ఔటైంది. తరువాత హర్లీన్‌ డియోల్‌ (43; 40 బంతుల్లో 5ఫోర్లు), సుజీ బేట్స్‌ (26; 22 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఏక్తా బిష్ఠ్‌, అమెలియా కెర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.