వెనిజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం

వెనిజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం

వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురోపై డ్రోన్ దాడి జరిగింది. సైనికుల కవాతు కార్యక్రమంలో పాల్లోన్న సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ పేలింది. ఈ దాడి నుంచి అధ్యక్షుడు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక మీడియా విడుదల చేసింది. మాడురో ప్రసంగిస్తున్న సమయంలో గాల్లో పేలుడు శబ్దం వినిపించడం, మాడురోతో పాటు పక్కనున్న వాళ్లంతా భయపడుతూ పైకి చూడటం వీడియోలో కనిపిస్తుంది. ఘటనానంతరం అక్కడికి వచ్చిన సైనికులు, ప్రజలు పరుగులు తీయడం స్థానిక ఛానెళ్ల ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించింది. 

ఈ దాడిలో ప్రమేయమున్న అనుమానితులను ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించే పనిలో ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతల నడుమ మాదురోను భద్రతా బలగాలు సురక్షితంగా వేదిక బయటకు తీసుకువచ్చారు. ఈ పేలుడు ఘటనలో సుమారు 9మంది గాయపడి ఉండవచ్చిన అంచనా వేస్తున్నారు. ఈ ఘటన అంతటికి సూత్రధారులు పొరుగు దేశం కొలంబియా, అమెరికాలోని కొందరు ఆర్థిక వేత్తలే కారణమని మాదురో ఆరోపించారు. 


ఈ దాడి తమ పనేనని నేషనల్ మూవ్‌మెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్ అనే గ్రూపు ప్రకటించింది. నిజానికి తాము రెండు డ్రోన్లను పంపినా.. స్నైపర్లు ఒకదానిని మధ్యలోనే పేల్చేశారని ఆ గ్రూపు చెప్పింది. ఈరోజు విఫలమైనా.. ఏదో ఒక రోజు మాడురోను హత్యచేస్తామని స్పష్టంచేసింది.