భాషను బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవడం సరికాదు

భాషను బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవడం సరికాదు

మన దేశంలో ఏ భాషనూ బలవంతంగా ఇతరులపై రుద్దడం కానీ, వ్యతిరేకించడం గానీ చేయొద్దని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఆయన కార్యాలయం నుండి ఈ మేరకు ఓ ప్రకటన విడుదలయ్యింది. హిందీ దినోత్సవం రోజున హిందీ దేశభాష కావాలని, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. ప్రజలు ఎక్కువ భాషలు నేర్చుకోవడం మంచిదేనని, కానీ ఏదో ఒక భాషను బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవడం సరికాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

అదే సమయంలో మరో భాషను కూడా వ్యతిరేకించడం చేయకూడదని హితవు పలికారు.  ఇక ఈరోజు వెంకయ్య దిల్లీలో విద్యార్థులనుద్దేశించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు వీలును బట్టి తమ తల్లిదండ్రుల సహకారంతో దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలు చుట్టి రావాలని, దీని ద్వారా వేర్వేరు ప్రాంతాల సంస్కృతులు, భిన్న ఆహార అలవాట్లు, భాష వంటి వాటిపై అవగాహన ఏర్పడుతుందని విద్యార్థులకు సూచించారు. తరగతుల్లో 50 శాతం సమయం బయటే గడపాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు.