జగన్‌ను కలిసిన ఆనం... ఆ ప్రతిపాదన వెనక్కి...!

జగన్‌ను కలిసిన ఆనం... ఆ ప్రతిపాదన వెనక్కి...!

నెల్లూరు రాజకీయాల్లో ఒక్కసారిగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి... సొంత పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి... దీంతో ఆయనపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు.. షోకాజ్ నోటీసు కూడా జారీ చేయాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇవాళ అసెంబ్లీలో సీఎం జగన్ కలిశారు ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.. నెల్లూరు నేతలతో కలిసి ఆనంను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఇక, ఆనంతో మాట్లాడిన సీఎం జగన్, ఇకపై ఎలాంటి విషయాలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఇక, ఇదే సందర్భంలో తన వ్యాఖ్యల వెనక ఉద్దేశాన్ని ముఖ్యమంత్రికి వివరించారు ఆనం రాంనారాయణరెడ్డి... ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి తన మాఫియా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారాయన... ఇలాంటి విషయాల్లో సీనియర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఆనంకు షో కాజ్ నోటీస్ ఇవ్వాలనుకున్న ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు సీనియర్ ప్రజాప్రతినిధి అయిన ఆనం తన సీనియారిటీతో అవసరమైన సందర్భాలలో పార్టీకి దన్నుగా నిలిచారు.