బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్

బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్

ప్రముఖ కన్నడ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు.  అనారోగ్యంతో ఈరోజు ఉదయం 6 గంటల 30 నిముషాలకు బెంగుళూరులోని స్వగృహంలో ఆయన మృతి చెందారు.  గిరీష్ కర్నాడ్ కేవలం నటుడు మాత్రమే కాదు రచయిత, దర్శకుడు కూడా.   19 మే 1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించిన ఆయన కన్నడలో పలు నాటకాలను రచించారు. 

1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో అరంగేట్రం చేసిన ఈయన కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లోని అనేక చిత్రాల్లో నటించారు.  అంతేకాదు మాల్గుడి డేస్, ఇంద్రధనుష్ లాంటి ప్రముఖ టీవీ సీరియళ్లలో సైతం ఆయన నటించారు.  నిష్ణాత్, సంస్కార్ వంటి చిత్రాలతో మంచి పేరు గడించిన ఆయన తెలుగులో 1983లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనంద భైరవి చిత్రంతో పాటు ధర్మచక్రం, శంకర్ దాదా, కొమరం పులి వంటి సినిమాల్లో నటించారు.  తన సినీ జీవితంలో ఆయన ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు.  సాహిత్య రంగంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులను బహుకరించింది.