బాలు ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి ఆరా..!

బాలు ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి ఆరా..!

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు గత రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు.  ఎంజీఎం ఆసుపత్రికి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి బాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, సాధారణ పరిస్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. అవసరమైతే నిపుణులను సంప్రదించాలని డాక్టర్లకు వెంకయ్య నాయుడు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నిన్న సాయంత్రం  నటుడు కమలహాసన్ ఆసుపత్రికి చేరుకుని బాలు కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమల్ మీడియాతో మాట్లాడుతూ.. బాలు క్షేమంగా ఉన్నారని చెప్పలేను కానీ, ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.