పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

గురువారం 100 కోట్ల నిధులతో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నారాయణ, సోమిరెడ్డి.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, జిల్లా ప్రముఖులు హాజరయ్యారు. 1300 కోట్లతో నిర్మించిన కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైన్, నెల్లూరు-చెన్నైల మధ్య ఎక్స్ ప్రెస్ మెమో ట్రైన్, ప్రవేశ మార్గాలు, రైల్వే వంతెలను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో వైఫై.. చెన్నై తిరువొత్తియుర్, అక్కంపేట స్టేషన్ లలో రిజర్వేషన్ కౌంటర్, బుకింగ్స్ కౌంటర్లను ప్రారంభించారు. వెంకటాచలం-రాపూరు మధ్య పాసింజర్ రైళ్ల కోసం శంకుస్థాపన చేశారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ... దేశంలోనే దక్షిణ మధ్య రైల్వే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. స్వచ్ఛత, రైళ్లలో ప్రయాణికుల భద్రత విషయంలో ముందున్నాం. 1830 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు ఇవాళ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపేలా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో మూడు, నాలుగు రైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నాం. ఏ టెలికాం సర్వీస్ ఇవ్వలేనంత స్పీడ్ లో రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పిస్తున్నాం. ఏపీలో 7 ట్రైన్లకు సంబంధించి రాకపోకలల్లో ప్రయాణికుల సూచన మేరకు మార్పులు, స్టాపింగ్ లను పెంచాం అని కేంద్ర మంత్రి తెలిపారు.