ఓ పోలిస్‌ సాహసం... ఎమ్మెల్యే సాయం

ఓ పోలిస్‌ సాహసం... ఎమ్మెల్యే సాయం

ఢిల్లీ నారాయణపుల్‌ ఎమ్మెల్యే జర్నయిల్‌ సింగ్‌కు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. మొన్న సాయంత్రం అయిదున్నర గంటల సమయంలో తన నియోజకవర్గంలో కారులో వెళుతుండగా ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ ఓ కారు బ్యానెట్‌పై అడ్డంగా పడి.. కారు కదలకుండా చేస్తున్నాడు. అతని చేతిలో ఈ చలాన్‌ వసూలు చేసే మెషిన్‌. కారు దిగి కథేమిటని అడిగాడు. అక్రమంగా రోడ్డుపై కారు పార్కు చేసినందుకు చలాన్ వేశానని, కాని కారు ఓనర్‌ కట్టకుండా... ముందుకు వెళ్ళాడని.. తాను అడ్డుకుంటున్నానని చెప్పాడు. 'కారు నీ పైనుంచి పోనిస్తా. అడ్డు జరుగు' అని డ్రైవర్‌ బెదిరించినా కారుకు అడ్డుగా నిలిచి... తన విధి నిర్వహించే ప్రయత్నం చేశాడు ఆ పోలీస్‌. దీంతో ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకుని డ్రైవర్‌ చలాన్‌ కట్టేలా చేశాడు. విధి నిర్వహణలో అడ్డు తగలిన కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకొమ్మని అక్కడి పోలీసులను కోరారు. పై అధికారి నుంచి ఫోన్‌ వచ్చిందని, అతన్ని వొదిలేశామని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పడంతో అవాక్కయ్యాడు... ఎమ్మెల్యే. వీడియోతో పాటు ఆ ఘటన వీడియోను సామాజిక మీడియాలో పోస్ట్‌ చేశాడు జర్నయిల్‌ సింగ్‌.

కొసమెరుపు ఏమిటంటే... ఢిల్లీలో పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ ఉండదు. అందుకే అక్కడి ఎమ్మెల్యే మాటను ఖాతరు చేయరనడానికి ఇదే ఘటనే ఉదాహరణ.