అబూదాబీలో మొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన

అబూదాబీలో మొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన

ఈ ఉదయం అబూదాబీలో చారిత్రక శంకుస్థాపన మహోత్సవం జరిగింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణానికి పునాది రాయి పడింది. భారత సంతతికి చెందిన వేలాది మంది భక్తులు, భారత్, యుఏఈ దేశాలకు చెందిన పలువురు అధికారుల సమక్షంలో కొత్త చరిత్రకు శిలాన్యాసం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత 11.45 నిమిషాల ముహూర్తానికి పునాదిరాళ్లు వేశారు. యుఏఈ వ్యాప్తంగా ఉన్న 2,500 మందికి పైగా భారతీయులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

వేకువ జాముననే వందలాదిగా తరలి వచ్చిన భక్తులు పూజలు నిర్వహించే గుడారం ఎదుట బారులు తీరారు. భారీ ఎయిర్ కండిషన్డ్ గుడారం పూర్తిగా భక్తులతో నిండిపోయింది. బోచాన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ సంస్థ (బీఏపీఎస్) స్వామి నారాయణ్ సంస్థ అధినేత మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో వేద సంప్రదాయాలను అనుసరించి పూజాదికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ముఘీర్ అల్ ఖైలీ, మంత్రులు థనీ అల్ జొయౌదీ, అహ్మద్ బిల్హౌల్ అల్ ఫలాసీ హాజరయ్యారు. యుఏఈలో భారత రాయబారి నవ్ దీప్ సూరీ, ఎన్ఎంసీ గ్రూప్ చైర్మన్ బీఆర్ షెట్టీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

బీఏపీఎస్ హిందూ మందిరం అబూదాబీలోని అబూ మురీఖా, ఈ11 ఎక్స్ ప్రెస్ వే, ఎగ్జిట్ 366 దగ్గర నిర్మిస్తున్నారు. ఇతర సాధువులతో కలిసి మహారాజ్ శిలాన్యాస్ విధి నిర్వహించారు. ఈ ఆలయాన్ని యుఏఈ సాయుధ దళాల ఉప సర్వసైన్యాధిపతి, అబూదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత సంతతకి బహూకరించిన 13.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఆలయ ఆవరణలో పార్కింగ్ సౌకర్యం కోసం అంతే భూమిని యుఏఈ ప్రభుత్వం బహుమానం ఇచ్చింది.