సుజనాచౌదరికి సాయిరెడ్డి కౌంటర్..

సుజనాచౌదరికి సాయిరెడ్డి కౌంటర్..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సుజనా చౌదరి ఈ సారి వెరైటీగా ప్రెస్‌మీట్ పెట్టాలని.. అప్పుడు తన ఎదురుగా విలేకరులను కాకుండా.. ఆయన వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకు అధికారులను కూర్చోబెట్టి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.. ఇలాంటి ప్రెస్‌మీట్ పెడితే.. సుజనా ఎందుకు పార్టీ మారారో..? చంద్రబాబు ఆయనను ఎందుకు పార్టీ మార్చారో అర్థమవుతాయన్నారు. 

సుజనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందించిన సాయిరెడ్డి... "నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వేరు... అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపీ) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది." అని ఎద్దేవా చేసిన ఆయన.. "అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురుంచి ప్రెస్ మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది." అని సెటైర్లు వేశారు. ఇక, "ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే... ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఎందుకు మార్చాడో అన్నీ అర్ధమవుతాయి." అని మరో ట్వీట్ చేసిన సాయిరెడ్డి.. " "సుజనా వారి మాయా సామ్రాజ్యం" మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతేక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు... సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు నిన్న ప్రెస్ మీట్ ను లైవ్ లో, లైవ్ స్ట్రీమింగ్ లో మోతేక్కించిందంటే... కారణం పబ్లిక్ ఇంటెరస్టా? లేక పబ్లిక్ గా తెలిసిపోయిన ఇంటెరస్టా?" అంటూ మరో ట్వీట్ సంధించారు.