విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీకి ఇది టైమ్‌ కాదు

విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీకి ఇది టైమ్‌ కాదు
దక్షిణాదిన సినీనటులు రాజకీయాల వైపు అడుగులేస్తున్నారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, పవన్‌కల్యాణ్‌, ఉపేంద్ర, సుదీప్‌.. ఇలా ఇటీవల కాలంలో బోలెడంత మంది స్టార్లు పోలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాట చూస్తే.. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నటులు విజయ్‌, అజిత్‌, విక్రమ్‌. అజిత్‌ విషయానికి వస్తే.. ఎప్పడూ తను రాజకీయాలకు దూరంగానే ఉంటాడు. విజయ్‌ మాత్రం రాజకీయాలపై తరచూ స్పందిస్తుంటాడు. తాజాగా కావేరి బోర్డు ఏర్పాటుపై జరిగిన ఆందోళనల్లో కూడా పాల్గొన్నాడు. దీంతో.. విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపైనా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ తండ్రి, ప్రముఖ దర్శక, నిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్పందించారు. విజయ్‌ ఇప్పుడే రాజకీయాల్లోకి రాకపోవచ్చని చెప్పారు. 'విజయ్‌ రాజకీయాల్లోకి రావడం మంచిదే అని తండ్రిగా నా అభిప్రాయం. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికిప్పుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తే.. ప్రజలంతా దాన్ని ఓ జోక్‌గా తీసుకుంటారు. అందుకే.. ఇప్పుడే రాజకీయాల్లోకి రాడనుకుంటున్నాను. విజయ్‌ ఎప్పడూ సరైన నిర్ణయాలే తీసుకుంటాడు. అయితే.. అతని రాజకీయ రంగ ప్రవేశంపై ఏ నిర్ణయం తీసుకుంటాడో మాత్రం చెప్పలేను' అని తెలిపారు.